Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయందోస్త్‌ అడ్మిషన్లు యథాతథం

దోస్త్‌ అడ్మిషన్లు యథాతథం

- Advertisement -

– మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌

తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల(రిజర్వేషన్ల సర్దుబాటు) చట్టం-2025 చెల్లదని పేర్కొంటూ దాఖలైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. సదరు చట్టం చట్ట వ్యతిరేకమంటూ షెడ్యూల్‌ కులాల ఐక్య వేదిక ఉపాధ్యక్షులు గడ్డం శంకర్‌, మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య వేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారించింది. దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ల వినతిని తోసిపుచ్చింది. ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ లాయర్లు వాదిస్తూ.. రాష్ట్రం జారీ చేసిన జీవో 33, జీవో 9, 10, 99 అమలును నిలిపేయాలని కోరారు. ఎస్సీ కులాల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణకు ఏక సభ్య కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌కు చట్టబద్ధత లేదన్నారు. కమిషన్‌ 2011 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడాన్ని తప్పుపట్టారు. జూన్‌ 13న తరగతులు ప్రారంభం కానున్నాయనీ, ఆ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కనీసం సీట్ల కేటాయింపు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ చట్టాన్ని సవాలు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులకు ఆస్కారం లేదన్నారు. వాదనల తర్వాత ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణను జూన్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.
వేసవి సెలవుల్లో తరగతులపై వివరణివ్వండి :రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
వేసవి సెలవుల్లో ప్రయివేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయనే పిల్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ప్రభుత్వ వాదనలు విన్న తరువాతే తగిన ఉత్తర్వులిస్తామని చెప్పింది. పిటిషనర్‌, వాళ్ల పిల్లలు బాధితులు కానప్పుడు పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా వేసవి తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలను ప్రతివాదులుగా ఎందుకు చేయలేదని అడిగింది. సమ్మర్‌ హాలిడేస్‌లో ప్రయివేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ లాయర్‌ క్రాంతి కుమార్‌ వేసిన పిల్‌ను బుధవారం జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ, తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విద్యా క్యాలెండర్‌ ప్రకారం వేసవిలో ప్రయివేటు కాలేజీలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పుడు కాలేజీలకు వేసవి సెలవులనీ, జూన్‌లో తిరిగి తెరుచుకుంటాయని వివరించారు. కొన్ని కాలేజీలు కోచింగ్‌ మాత్రమే ఇస్తున్నాయని తెలిపారు. కౌంటర్‌ వేసేందుకు గడువు కావాలని కోరడంతో విచారణ వాయిదా వేసింది.
మైలాన్‌ ల్యాబొరేటరీస్‌కు వెసులుబాటు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఇండిస్టీయల్‌ ఎస్టేట్‌ బొల్లారంలోని మైలాన్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ (మాట్రిక్స్‌ ల్యాబొరేటరీస్‌)కి హైకోర్టులో ఊరట లభించింది. ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్తు సరఫరా నిలిపివేతతోపాటు ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ)ని ఆదేశించింది. ఆకంపెనీలో అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని పీసీబీని జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆదేశించింది. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో మైలాన్‌ ల్యాబ్స్‌కు చెందిన ర్యాండ్‌ ఫెసిలిటీతోపాటు విద్యుత్‌ సర్వీస్‌ను నిలిపివేస్తూ పీసీబీ ఈ నెల 8న నిర్ణయం తీసుకోవడాన్ని ఆ కంపెనీ సవాలు చేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -