– 10 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు
– 21 వరకు తుదిగడువు
– 29న తొలివిడత సీట్ల కేటాయింపు
– మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
– జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం
– ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
– 908 కాలేజీల్లో 3.93 లక్షల సీట్లు : ఉన్నత విద్యామండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ వి బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం (ఓయూ), కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ), తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ), మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ), శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ), తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (టీడబ్ల్యూయూ) పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి. శనివారం నుంచి డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తుది గడువున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశమున్నది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 21, 22 తేదీల్లో విశ్వవిద్యాలయాల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈనెల 29వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలకు ష్ట్ర్‌్‌జూర://సశీర్.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, కళాశాల విద్యాశాఖ జేడీ డిఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్, అకడమిక్ గైడెన్స్ అధికారి పి బాలభాస్కర్, దోస్త్ హెల్ప్‌డెస్క్ కోఆర్డినేటర్ విజయారెడ్డి, వసుంధర తదితరులు పాల్గొన్నారు.
40 హెల్ప్‌లైన్ కేంద్రాలు
డిగ్రీ ప్రవేశాల కోసం మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 40 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఒకటి, విశ్వవిద్యాలయాల పరిధిలో ఆరు, జిల్లా కేంద్రాల్లో 33 చొప్పున మొత్తం 40 హెల్ప్‌లైన్ కేంద్రాలున్నాయి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఆధారంగా విద్యార్థులు దోస్త్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ కాలేజీల్లో సీట్లు పొంది ఈపాస్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న వారు ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయివేటు కాలేజీల్లో సీట్లు పొంది ఈపాస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు రూ.వెయ్యి చెల్లించాలి. రిజర్వేషన్ల కింద సీట్ల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మీసేవా కులధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ (సీఎన్‌డీ నెంబర్, ఉపకులంతో) నమోదు చేయడం తప్పనిసరి. 2024, ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎన్‌సీసీ, అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్, వికలాంగులు, సీఏపీ ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. విద్యార్థులు సందేహాలుంటే 7901002200 వాట్సాప్ నెంబర్‌ను లేదా హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలి.
డిగ్రీలో 4.57 లక్షల సీట్లు : బాలకిష్టారెడ్డి
గత విద్యాసంవత్సరంలో 1057 డిగ్రీ కాలేజీల్లో 4,57,724 సీట్లుంటే, 2,60,904 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. ఇందులో దోస్త్ పరిధిలో 908 డిగ్రీ కాలేజీల్లో 3,93,467 సీట్లుంటే, 2,23,069 మంది విద్యార్థులు చేరారని అన్నారు. 79 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 23,654 14,881 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని వివరించారు. దోస్త్ పరిధిలో లేకుండా 70 కాలేజీలున్నాయనీ వాటిలో 40,603 సీట్లుంటే, 22,954 మంది విద్యార్థులు చేరారని అన్నారు.
