Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'డబుల్‌' ఇండ్లు కేటాయించి పట్టాలివ్వలేదు

‘డబుల్‌’ ఇండ్లు కేటాయించి పట్టాలివ్వలేదు

- Advertisement -

ఎమ్మెల్యే కేసీఆర్‌.. ఎంపీ రఘునందన్‌రావు గజ్వేల్‌కు రారు
మా కాలనీ సమస్యలు పట్టించుకోరు
సమస్యలు పరిష్కరించని యేడల మున్సిపల్‌ ఎన్నికలను బహిష్కరిస్తాం
రోడ్డెక్కిన సిద్దిపేట జిల్లా సంగాపూర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల బాధితులు

నవతెలంగాణ-గజ్వేల్‌
తెలంగాణ మాజీ సీఎం, గజ్వేల్‌ ఎమ్యెల్యే కేసీఆర్‌.. బయటకు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల మున్సిపల్‌ ఎన్నికలు బహిష్కరిస్తామని గజ్వేల్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల బాధితులు ఆదివారం రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాల్టీలోని సంగాపూర్‌ వద్ద ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల వద్ద లబ్దిదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ కమిటీ అధ్యక్షులు దయాకర్‌, లబ్దిదారులు మాట్లాడుతూ.. మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సైతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు మూడుసార్లు ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పటి వరకు ఆయన ముఖం కూడా చూడలేదని తెలిపారు. కేసీఆర్‌ మధ్యవర్తుల మూలంగా నష్టపోయామని వాపోయారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్‌ గజ్వేల్‌ మున్సిపల్‌ నిరుపేదలకు 1100 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి.. లాటరీ పద్ధతిన ఎంపిక చేసి ఇచ్చారన్నారు.

గజ్వేల్‌ అంతర్గత రోడ్ల వెడల్పు కోసం ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఈ ఇండ్లను కేటాయించారని, కానీ ఇప్పటివరకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు. కనీస వసతులు కూడా కల్పించలేదని, మూడేండ్ల నుంచి రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల కోసం రాజకీయ నాయకులు మళ్లీ ప్రచారం మొదలుపెట్టారని, దాంతో కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తాము గుర్తుకు వస్తామా అంటూ ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని.. లేని యెడల ఎన్నికలు బహిష్కరిస్తామని స్పష్టంచేశారు. సుమారుగా 5000 ఓట్లు ఉంటాయని.. సమస్యలు పరిష్కరించిన తర్వాతే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలోని సమస్యలు పరిష్కరించి.. ఇండ్ల పట్టాలు ఇచ్చి, తమకు ప్రత్యేక వార్డు కేటాయించి ఎలక్షన్‌ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఫరీద్‌, పాషా, శేఖర్‌, స్వరూప, లక్ష్మి, నాగేందర్‌, రామచంద్రం, కిషన్‌, రాములు, సందీప్‌, లబ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -