Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'డబుల్‌' ఇండ్లను అప్పగించాలి

‘డబుల్‌’ ఇండ్లను అప్పగించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్దిదారుల భారీ ర్యాలీ
– తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-జహీరాబాద్‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మున్సిపల్‌ హౌతి(కె)లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను తమకు అప్పగించాలని లబ్దిదారులు డిమాండ్‌ చేశారు. ఈ డబుల్‌ ఇండ్లను 20 రోజుల్లో అప్పగిస్తామన్న హామీని అధికారులు నిలబెట్టుకోకపోవడంతో వారు మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జహీరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఇండ్ల తాళాలు అప్పగించి ఇండ్లను స్వాధీనం చేసే తేదీని స్పష్టంగా ప్రకటించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకూర్చున్నారు. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌తో సీపీఐ(ఎం) నాయకులు ఫోన్‌లో మాట్లాడారు. 7వ తేదీలోగా ఇండ్ల తాళాలు అప్పజెప్పుతామని, అప్పటివరకు వేచి ఉండాలని అధికారులు తెలిపారు. దాంతో లబ్దిదారులు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జహీరాబాద్‌ ఏరియా కమిటీ సభ్యులు ఎస్‌.మహిపాల్‌ మాట్లాడుతూ.. పేదలకు వచ్చిన ఇండ్లను ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే లబ్దిదారులకు ఇండ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సారి కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం 7వ తేదీలోపు ఇండ్ల తాళాలు ఇవ్వకుంటే లబ్దిదారులే వెళ్లి ఇండ్లలో ఉంటారని స్పష్టం చేశారు. ఆ పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్‌ బెడ్‌ రూమ్‌ లబ్ధిదారులు శ్రీనివాస్‌, శివకుమార్‌, యాదుల్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -