Friday, March 27, 2026
E-PAPER
Homeజిల్లాలుOil Mafia: కల్తీ ఆయిల్‌పై అనుమానాలు…అధికారుల స్పష్టతపై సందేహాలు

Oil Mafia: కల్తీ ఆయిల్‌పై అనుమానాలు…అధికారుల స్పష్టతపై సందేహాలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో వంట నూనెల నాణ్యతపై అనుమానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే సూర్య గింజల నూనె, పల్లి నూనె వంటి ఉత్పత్తుల్లో కల్తీ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నూనెల తయారీలో క్రూడ్ ఆయిల్ లేదా ఇతర రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నారన్న సందేహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ విక్రమ్‌ను వివరణ కోరగా, ఇటీవల తీసుకున్న ఆయిల్ నమూనాలను ప్రయోగశాలకు పంపించామని, వాటిలో ఎలాంటి కల్తీ తేలలేదని తెలిపారు. అయితే, మార్కెట్‌లో నూనెల ధరలు, ఉత్పత్తి ఖర్చుల మధ్య వ్యత్యాసం ఉండటంతో ప్రజలు అధికారుల సమాధానంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, సూర్య గింజల ధర కిలోకు సుమారు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంది. సాధారణంగా ఒక కిలో గింజల నుంచి పూర్తి కిలో నూనె ఉత్పత్తి కావడం సాధ్యం కాదు. అలాంటప్పుడు మార్కెట్‌లో సూర్య గింజల నూనెను కిలో 180 రూపాయల కు విక్రయించడం ఎలా సాధ్యమవుతోందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో తులసి ఆయిల్ ఇండస్ట్రీస్‌తో పాటు మరికొన్ని ఆయిల్ పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వీటిపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిష్పక్షపాతంగా నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వంట నూనెల నాణ్యతపై పారదర్శక నివేదికలు విడుదల చేసి, వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

చర్యలు ఎక్కడ..? ఫిర్యాదులకు ఫలితం శూన్యం !

జిల్లాలో కల్తీ నూనెల వ్యవహారం రోజురోజుకీ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని సమాచారం.

ఫిర్యాదు నేపథ్యంలో ఆర్డీవో, ఫుడ్ సేఫ్టీ, సివిల్ సప్లై, పరిశ్రమల శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.  పరిశీలనకు వెళ్లిన రోజే ఫిర్యాదుదారునికి బెదిరింపులు వచ్చాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫిర్యాదు చేసిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఇంకా, కల్తీ నూనెల తయారీలో “AD-Mixed” వంటి పదార్థాలు ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరగకపోవడం పలు సందేహాలకు దారితీస్తోంది.

అధికారుల వివరణ..

జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి విక్రమ్ మాట్లాడుతూ, ఇటీవల సేకరించిన ఆయిల్ నమూనాలను పరీక్షకు పంపించగా ఎలాంటి కల్తీ తేలలేదని తెలిపారు. తులసి ఆయిల్ ఇండస్ట్రీస్ కేంద్ర లైసెన్సింగ్ పరిధిలో పనిచేస్తోందని పేర్కొన్నారు.

ప్రజల డిమాండ్

ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమాలను అరికట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి నిజానిజాలను వెలికితీసి, కల్తీ నూనెల తయారీని పూర్తిగా అరికట్టాలని కామారెడ్డి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -