హక్కులను కాపాడుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని తరిమికొట్టాలి : ఐద్వా జాతీయ ప్యాట్రన్, మాజీ ఎంపీ బృందాకరత్ పిలుపు
ప్రజాస్వామ్యం, మత సామరస్యం, లౌకికత్వంపై బుల్డోజర్
రాజ్యాంగానికి కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌కు మోడీ సెల్యూట్
ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు బలమైన ఉద్యమం
తెలంగాణ చరిత్ర పోరాటాలకు స్ఫూర్తిదాయకం
హైదరాబాద్‌లో ఐద్వా జాతీయ మహాసభ బహిరంగసభ
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
దేశంలో మహిళలు హక్కులను కాపాడు కోవాలన్నా, ఉన్న వాటిని పొందాలన్నా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని తరిమికొట్టాలని ఐద్వా జాతీయ ప్యాట్రన్, మాజీ ఎంపీ బృందాకరత్ పిలుపునిచ్చారు. బీజేపీ భగావో.. దేశ్‌కో బచావో అని అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌భవన్ గ్రౌండ్ (మల్లు స్వరాజ్యం ప్రాంగణం)లో ఐద్వా జాతీయ 14వ మహాసభల సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు లో ప్రసంగాన్ని ప్రారంభించి అందర్నీ అలరించారు. తెలంగాణ చరిత్ర మహిళా పోరాటాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇక్కడి మహిళల పోరాటాలు దేశానికే ఆదర్శమని వివరించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నామని అన్నారు. ప్రధాని మోడీ ప్రజల కోసం రాజ్యాంగానికి సెల్యూట్ చేయకుండా ఆర్‌ఎస్‌ఎస్‌కు సెల్యూట్ చేస్తున్నారని విమర్శించారు. మహిళలు ఎదుర్కొంటున్న అదిపెద్ద సవాల్, ప్రమాదం ఆర్‌ఎస్‌ఎస్ అని అన్నారు.
దేశంలో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని తెలిపారు. సమానత్వం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, హక్కులు వంటి వాటిని రాజ్యాంగం ఇచ్చిందని చెప్పారు. వాటిని మోడీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూలుస్తోందని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించుకోవాలంటే బుల్డోజర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. పేదలు, మహిళల కోసం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధి చేస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ కోసం బలమైన ఐక్య ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. దళితులు, హిందువులు, మైనార్టీలు ఎవరైనా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని హత్య చేయాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. ఇంకోవైపు సంప్రదాయం పేరుతో మహిళల హక్కులను కాలరాస్తున్నదని చెప్పారు. ఎక్కడైతో మానవ హక్కులుంటాయో, మహిళలు స్వేచ్ఛగా ఉంటారో అక్కడ అభివృద్ధి కూడా ఉంటుందని అన్నారు.

దోపిడీపై మేం నిద్రపోం… చేసే వారిని నిద్రపోనివ్వం :మరియం ధావలే
దోపిడీ, అన్యాయాలపై తాము నిద్ర పోబోమనీ, దోపిడీకి పాల్పడే వారిని కూడా నిద్ర పోనివ్వబోమని ఐద్వా జాతీయ ప్రధాన కార్య దర్శి మరియం ధావలే అన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదనీ, ఆదాయం లేకుంటే ఆ కుటుంబం ఎలా జీవిస్తుందని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు పది శాతం వరకు వడ్డీకి అప్పులిచ్చి వేధింపులకు గురిచేస్తున్నాయని అన్నారు. దీంతో మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. మనుస్మృతిలో భాగంగా బీజేపీ విధానాలతో విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిల సంఖ్య తగ్గుతున్నదన్నారు. మహిళలపై హింస పెరుగుతున్నదని చెప్పారు. దేశంలో గూండాలకు బెయిల్ వస్తున్నదనీ, హక్కుల కోసం పోరాడిన వారు జైళ్లలోనే మగ్గుతు న్నారని వివరించారు. దోపిడీదారులకు, నేరస్తులకు మోడీ ప్రభుత్వం అండగా నిలబడు తున్నదని అన్నారు. అంబానీ, అదానీలు దేశాన్ని దోపిడీ చేస్తున్నారని చెప్పారు. మహిళల సమస్య లపై, వారు గౌరవంగా జీవనం సాగించేందుకు ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
కొత్త జమీందార్లకు మోకరిల్లుతున్న మోడీ సర్కారు : సుభాషిణీఅలీ
”తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి వీరనారీమణులు జాగీర్దార్లు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 78 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఆనాటి ఫ్యూడల్ దోపిడీ విధానాలు ఇప్పుడు కూడా కొత్త రూపాల్లో కొనసాగు తున్నాయి. అదానీ, అంబానీ లాంటి కొత్త జమీందార్లకు ప్రధాని మోడీ మోకరిల్లుతున్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, భూములు, వనరులను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారు. అనాటి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకుని నయా పెట్టుబడిదార్లను తుద ముట్టించేందుకు మరో ఉద్యమానికి సమాయత్తం కావాలి” అని మాజీ ఎంపీ సుభాషిణీ అలీ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విధ్వంసమే : ఎస్ పుణ్యవతి
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విధ్వంసమే జరగుతుందని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో సర్ పేరిట 65 లక్షల ఓట్లను తొలగించారని అన్నారు. ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అదే పరిస్థితి తెలంగాణలో దాపురిస్తుందన్నారు. మతోన్మాద శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా తరిమికొట్టాలని అన్నారు. రామభజన చేయాలని ప్రజలకు చెప్తూ బీజేపీ నాయకులు మాత్రం అదానీ, అంబానీ భజన చేస్తున్నారని విమర్శించారు.
కేరళ విధానాలు దేశానికే ఆదర్శం : పి.కె.శ్రీమతి
కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శమని అధ్యక్షత వహించిన ఐద్వా జాతీయ అధ్యక్షులు పి.కె. శ్రీమతి అన్నారు. ఆ రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న 60,004 కుటుంబాలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్మూలించిందని వివరించారు. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ ప్రజానుకూలం కాదనీ, కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలమని అన్నారు. దేశంలో 70 శాతం నుంచి 66 శాతానికి మహిళల అక్షరాస్యత తగ్గిందన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తేవాలని చూస్తున్నదని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కోసం ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్లను అమలు చేయకుంటే జంగ్ సైరన్ మోగిస్తాం : మల్లు లక్ష్మి
మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలనీ, లేదంటే తెలంగాణ నుంచి జంగ్ సైరన్ మోగిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించేందుకు మనువాదులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలను పిల్లల్ని కనే యంత్రాలుగా పరిమితం చేయాలన్న సంఘ్ పరివార్ కుట్రలను పారనివ్వబోమని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచామని గుర్తు చేశారు. ఈ గడ్డపై ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయనీ, పోరాటానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తాం : ఆర్ అరుణజ్యోతి
తెలంగాణ పోరాటాలకు పెట్టింది పేరనీ, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అన్నారు. మహిళా హక్కులను కాపాడుకునేందుకు మహాసభల్లో చర్చించి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
సమరశీల పోరాటాలకు మహిళలు సమాయత్తం కావాలి : జూలకంటి
ప్రజాస్వామిక హక్కులను కాపాడుకునేందుకు మహిళలు సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని ఐద్వా జాతీయ మహాసభల గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన పాలకుల విధానాలను, వారి నిర్లక్ష్యమే మహిళల వెనుకబాటుకు కారణమని అన్నారు. పురుషులతోపాటు శ్రమిస్తూ గుర్తింపు లేక, అసమానతలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేక ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని తరిమికొట్టడం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు రూ.2,500, పేదలకు ఇండ్లు, పెన్షన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.



