నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక వేసుకొని కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా రెవెన్యూ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, పరీక్షల సన్నద్ధత పై విద్యార్థులను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ముఖ్యంగా ‘ సి ‘ ‘కేటగిరీ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారికి రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టులను ప్రతిరోజు ఒకటికి రెండుసార్లు చదవాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు సి క్యాటగిరి విద్యార్థుల పై మరింత దృష్టి పెట్టి ఫలితాలను మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



