ఉక్రెయిన్ బరితెగింపు
రష్యా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు
శాంతి చర్చలకు విఘాతం
మాస్కో : ఉక్రెయిన్ మరోసారి బరితెగించింది. రష్యాలోని కుర్స్క్ అణు విద్యుత్ ప్లాంట్‌పై ఆదివారం ఉదయం డ్రోన్‌తో దాడి చేసింది. ఈ దాడితో న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. రియాక్టర్ నెంబర్ 3 ద్వంసమయింది, మంటల్లో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, రష్యా బలగాలు సకాలంలో డ్రోన్‌ను కూల్చేసి మంటలు అదుపులోకి తీసుకువచ్చాయని ప్లాంట్ అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా రష్యాలోని ఆణు విద్యుత్ కెేంద్రాలను, నూనె శుద్ది కర్మాగారాలను, విద్యుత్ గ్రీడ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందని రష్యా విమర్శించింది. గత వారంలో ఉక్రెయిన్ దళాలు యురోపియన్ యూనియన్‌కు చమురు సరఫరా చేసే ” డ్రుజ్‌బా ” పైప్‌లైన్ పై దాడి చేసింది. దీన్ని హంగేరి, స్లోవేకియా దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్ స్వాతంత్య్రదినోత్సవ రోజున రష్యాపై అనేక ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిందని, దాదాపు 95 ప్రాంతాల్లో డ్రోన్‌లను కూల్చేసామని రష్యా వర్గాలు వెల్లడించాయి. ఆదివారం జరిగిన దాడి సమయంలో మరో రెండు రియాక్టర్లు ఆఫ్‌లో ఉన్నాయని, డ్రోన్ దాడిని అడ్డుకోకపోతే తీవ్ర నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ( ఐఏఈఏ ) ఆందోళన వ్యక్తం చేసింది. అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు చాలా ప్రమాదకరమని , నష్టం ఊహించలేమని హెచ్చరించింది. ఈ దాడుల వల్ల ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, యుద్దం మరింత తీవ్రతరం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు..