తడి స్పర్శకు
పులకరించిన మట్టి వాసన
ఇయ్యాల ఒక దరికి రాని
గతకాలపు అనుభూతి..
వాన కురిసినప్పుడల్ల
మా గేరినిండా
పారిన వాననీళ్ళ జాడలు
తొవ్వనిండా మొలిచిన
ఇసుక కుప్పలు
ఎర్రమన్ను గంధాలు
పోటీలు పడి కట్టిన
కప్పగూళ్ళు ఇసుక కోటలు
కాకిలాగుకు తగిలిన
బురద కండ్లద్దాలు
చిట్టి చెరువులో
పొర్లిన కొర్రమట్టల ఈతలు
భద్రంగా అంగి కింద
దాచిన రేపటి బతుకు పేజీలు
ఎంతకూ ఒడువని
ముచ్చటలాగ
మొగులు నుండి
జల్లులు జల్లులుగా రాలే ముసుర్లు
మా నెత్తిమీది నుండి
పాయలు పాయలుగా
సంతోషమై పారేవి..
తడిసిన మట్టి ఎదపై
లేలేత పాదాలు చేసిన
తొక్కుడు బిళ్ళలు
గిల్లిదండల గాయాలు
ఇంటికొచ్చేసరికి
మాకాళ్ళకు మొలిచిన
మట్టి బూట్లు
మొకంమీద
ఎండిన గంధం పూతలు
జరిగిందంతా
అమ్మకు పూసగుచ్చేవి..
ఇపడంతా రాతి తనమే
మట్టిని స్పర్శించని
లేమోములు, చిట్టిచేతులు
అసలు మట్టి ముచ్చటే
మాట్లాడని నోళ్ళు
రంగు తెల్వని కండ్లు
వానలు వాసనల
అనుభూతులు తెల్వని
పంజరాల మనుగడలు
నగరం వీధులు
ఒళ్ళంతా రాతిచీరను
చుట్టుకుంటున్నాయి
తారురోడ్ల అంచులతో
మట్టి తనువు మీద
శిలల్ని పరుచుకుంటున్నాయి..
మట్టితనంతో
బంధుత్వాన్ని తెంచుకున్న
నగరం ఎద
ఏ అనుభూతి తెల్వని ఎడారి
చతురస్రాలు
ధీర్ఘచతురస్రాలుగా
రాతి వనాలను పెంచుతున్న
నగరం ఎదపై రాలిన చినుకు
తల్లిజాడ తెల్వక
వీధులన్నీ పారి
కాల్వలన్నిట జారి
మూసీపాలై
తానే కొట్టుకు పోతుంది..
నేనిపుడు నగరం రాతివనంలో
మినుకు మినుకుమంటున్న
మట్టికాలపు అనుభూతిని
కురుస్తున్న వర్షాన్ని
కంటిపాపలకు
కిటికీలోంచి చూపించే
కత్రిమత్వాన్ని
ఇండ్లలోనే చెరువుల్ని
చూస్తున్న సంధికాలపు
దిగులు కొమ్మను..
మట్టితనం కమ్మదనం
తెలిసిన వాణ్ణి
ఈ శిలావరణాన్ని చూసి
గుండె గోసవడ్తుంది.
నేనిపుడు
తిరుగు పయనం మొదలెట్టాలె
మట్టిని వెతుక్కుంటూ.
- అంకం మనోహర్,
9492503339