Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టుర‌ట్టు..

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టుర‌ట్టు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), చిక్కడపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు, ఒక వినియోగదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఒక మహిళా టెక్కీ ఉండటం సంచలనంగా మారింది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు వారి వద్ద నుంచి హైడ్రోపోనిక్ గంజాయి (OG) 22 గ్రాములు, MDMA 5 గ్రాములు, ఎక్స్టసీ మాత్రలు 5.57 గ్రాములు, ఎల్ఎస్‌డీ బ్లాట్స్ 6, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా డార్క్ వెబ్ ద్వారా మాదకద్రవ్యాలను సేకరించి, క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉమ్మిడి ఇమాన్యుయేల్. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అతడు తొలుత డ్రగ్స్ వినియోగదారుడిగా ఉండి, క్రమంగా పెడ్లర్‌గా మారినట్లు విచారణలో తేలింది. అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఎన్‌డీపీఎస్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇమాన్యుయేల్ లివ్-ఇన్ పార్ట్నర్ అయిన సుస్మితా దేవి అలియాస్ లిల్లీ, హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె డ్రగ్స్ విక్రయానికి సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తూ, తన బ్యాంక్ ఖాతాలోకి అక్రమ ఆదాయాన్ని తీసుకునేదని పోలీసులు తెలిపారు. ఇమాన్యుయేల్ లేని సమయంలో ఆమె స్వయంగా డ్రగ్స్ సరఫరా వ్యవహారాలను చూసుకునేది. జి.సాయి కుమార్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లో డ్రగ్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో డ్రగ్స్ వినియోగదారుడిగా తలబట్టుల తారక లక్ష్మీకాంత్ అయ్యప్ప అనే ప్రైవేట్ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో చదువుకున్న యువత డ్రగ్స్‌కు బానిసలై, చివరికి పెడ్లర్లుగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని డీసీపీ గైక్వాడ్ వైభవ్ రాఘునాథ్ తెలిపారు. ఇది వ్యక్తులకే కాదు, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -