Wednesday, October 22, 2025
E-PAPER
Homeక్రైమ్మత్తు టాబ్లెట్లు.. ఏడుగురి అరెస్ట్‌

మత్తు టాబ్లెట్లు.. ఏడుగురి అరెస్ట్‌

- Advertisement -

– 17 మందిపై కేసు.. మెడికల్‌ షాప్‌ యజమానికి రిమాండ్‌
– వెంకటరమణ మెడికల్‌ షాప్‌ సీజ్‌ : నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

స్పాస్మో టాబ్లెట్స్‌(మత్తును కలిగించే)ను విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి, మొత్తం 17మందిపై కేసు నమోదు చేసినట్టు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. మెడికల్‌ షాప్‌ యజమానిని రిమాండ్‌కు పంపించామన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 20న మధ్యాహ్నం తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో సిబ్బంది, నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్‌లో వాహన తనిఖీలు నిర్వహించారు. అది గమనించి బైక్‌పై పారిపోతున్న మహమ్మద్‌ జబీఉల్లాను వెంబడించి పోలీసులు పట్టుకొని విచారించారు. అతను మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని వెంకటరమణ మెడికల్‌ స్టోర్‌ నిర్వహకుడు దారం కృష్ణసాయి వద్ద డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా స్పాస్మో ప్రాక్సీవోన్‌ ప్లస్‌ టాబ్లెట్స్‌ ఒక్క షీట్‌ రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. నల్లగొండ టౌన్‌లో వాటిని వాడుతున్న వారికి ఒక్క షీట్‌ రూ.200కు విక్రయిస్తున్నాడు. ఈనెల 19న తొర్రూరులోని వెంకటరమణ మెడికల్‌ షాప్‌కు స్టోర్‌కు వెళ్లి సుమారు 8 బాక్సులు (ఒక్క బాక్స్‌లో 18 షీట్లు) కొనుగోలు చేశాడు. నల్లగొండ మునుగోడ్‌ రోడ్‌లో అతడి స్నేహితులైన ఆఫ్రోజ్‌, అహ్మెద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ అలియాస్‌ ఖాజీమ్‌, ఓవైజ్‌, జావీద్‌, ఫెరోజ్‌కు 8 టాబ్లెట్స్‌ చొప్పున అమ్మాడు. తిరిగి బైక్‌పై వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 2 ఫోన్లు, బైక్‌, 2400 స్పాస్మో ప్రాక్సీవోన్‌ ప్లస్‌, 345ట్రామోడాల్‌ టాబ్లెట్స్‌ వంటి మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 మంది నిందితులపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కేసు నమోదు చేశారు. ఏడుగుర్ని అరెస్టు చేశారు. మిగిలిన 10 మందిపై విచారణ కొనసాగుతోంది. తొర్రూర్‌లోని వెంకటరమణ మెడికల్‌ షాప్‌ను సీజు చేసి నిర్వాహకున్ని రిమాండ్‌ చేశారు. ఈ కేసును చాకచక్యంగా ఛేేదించిన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో డీఎస్పీ బిక్షపతిరావు, సిబ్బంది నరహరి, స్వామి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐలు సతీష్‌, గోపాల్‌రావు, సిబ్బంది రబ్బాని, షకీల్‌, ఆంజనేయులు, కిరణ్‌కు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యా, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అభినందనలు తెలిపారు.

ఇకపై ఉపేక్షించేది లేదు.. : డీఎస్పీ
డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఆపరేషన్‌ పరివర్తన్‌ కొనసాగుతుందని, యువతలో అవగాహన పెంపొందించే దిశగా నల్లగొండ పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. యువత మత్తు పదార్థాలు, టాబ్లెట్స్‌, గంజాయి, వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు విక్రయించినా, కొన్నా ఇకపై ఉపేక్షించేది లేదనిహెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -