- 11 మంది నిందితుల అరెస్ట్
- ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన మహారాష్ట్ర పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ నగర శివార్లలో గతంలో కనీవినీ ఎరుగని తీరులో మాదక పదార్థాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పోలీసులు వేసిన ప్రాథమిక అంచన ప్రకారం రూ.12 వేల కోట్ల విలువైన మాదక పదార్థాలు, వాటి తయారీకి వినియోగించే రసాయనాలు పట్టుబడ్డాయి. ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది తెలంగాణ పోలీసులు కాదు. సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర పోలీసులు.
మహారాష్ట్రలోని థానే పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం ప్రకారం చర్లపల్లిలోని నవోదయ కాలనీలో గల ఎండీ మ్యానిఫ్యాక్షర్స్ అనే ఫ్యాక్టరీపై మహారాష్ట్రకు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ భగత్ నేతృత్వంలోని స్పెషల్ టీం పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆ ఫ్యాక్టరీ నుంచి 5.3 కిలోగ్రాముల మెపిడ్రిన్ మాదక పదార్థంతో పాటు దాదాపు 35,500 లీటర్ల మాదక పదార్థాల రసాయనాలు, 950 కేజీల మాదక పదార్థాల పౌడరుతో పాటు మూడు ఫోర్ వీలర్స్, ఒక ద్విచక్ర వాహనంతో పాటు 27 సెల్‌ఫోన్లు పట్టుబడ్డాయి. అదే ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ యజమాని పండరీనాథ్ పట్వారీతో పాటు శ్రీనివాస్ విజరు వేలోటి, తానాజీలతో పాటు మొత్తం 11 మందిని మహారాష్ట్ర స్పెషల్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకముందు గత ఆగస్టు 8న థానేలో ఎండీఎంఏ మాదక బిల్లలను విక్రయిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమాషేక్ పోలీసులకు పట్టుబడింది. ఆమెను విచారించగా వీరి నెట్వర్క్‌కు చెందిన డ్రగ్ ట్రాఫికర్స్ మరో పది మంది దొరికారు. వీరి దగ్గర నుంచి 170 గ్రాముల ఎండీ మాదక పదార్థాలను ఆ సమయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ ట్రాఫికర్స్ మూలాలపై లోతుగా దర్యాప్తు జరిపిన మహారాష్ట్ర పోలీసులకు తెలంగాణలోని చర్లపల్లి ఏరియా నవోదయా కాలనీలో గల ఈ మాదక పదార్థాల తయారీ కేంద్రం గుట్టు రట్టయ్యింది. దాని ఆధారంగా దాడులు నిర్వహించి 11 మంది మత్తుపదార్థాల తయారీదారులను అరెస్ట్ చేశామని కమిషనర్ నికేత్ తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.12వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడ్డ మాదక పదార్థాలు, నిందితులను మహారాష్ట్రకు తరలించిన పోలీసులు తదుపరి విచారణను జరుపుతున్నారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నగర శివార్లలో ఇంత భారీ మొత్తంలో మాదక పదార్థాల తయారీ కేంద్రం గుట్టు రట్టు కావటం పట్ల రాష్ట్ర పోలీసులు కూడా ఆందోళనను చెందుతున్నారు. చర్లపల్లి ఫ్యాక్టరీ నుంచి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మాదక పదార్థాల రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తేల్చిన మహారాష్ట్ర పోలీసులు మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారని తెలిసింది. రాష్ట్ర యాంటీ నార్కొటిక్ సెల్ (ఈగల్) విభాగం అధికారులు సైతం బయట పడ్డ ఈ డ్రగ్స్ రాకెట్ సమాచారం ఆధారంగా తమ వైపు నుంచి కూడా తదుపరి దర్యాప్తును సాగిస్తున్నారు.