రాష్ట్రంలో ఏరులై పారిన మద్యం
మూడ్రోజుల్లో రూ.697.23 కోట్ల అమ్మకాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దసరా సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. మందు బాబులు తాగి ఊగారు. ఈ సారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ప్రభుత్వం ఒక రోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించింది. అయినా. అమ్మకాల్లో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. గతేడాదితో పోల్చితే ఇప్పటి వరు ఏడు శాతం మద్యం విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు, 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86.23 కోట్లు మొత్తం 697.23 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే మూడు రోజుల అమ్మకాలపై 60 నుంచి 80 శాతంగా పెరిగాయి.
మొత్తంగా సెప్టెంబర్ మాసంలో రూ.3,048 కోట్ల అమ్మకాలు సాగాయి. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో 2,838 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇందులో 29.92 లక్షల కేసుల లిక్కర్, 36.46 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్, చికెన్, మటన్, చేపలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ఇదిలా ఉండగా గాంధీ జయంతి రోజు మాంసం విక్రయాలు చేపట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా కార్పొరేషన్లలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రయత్నించినా ఫలితాలు ఇవ్వలేదు.