వర్షాకాలంలో విరివిగా లభించే మొక్కజొన్నలను నిప్పులపై కాల్చుకుని తింటుంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. మరికొంతమంది ఉడికించుకుని తింటుంటారు. అలాగే ఈ గింజలతో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. వాటినే కాస్త క్రిస్పీగా, టేస్టీగా ఉండేలా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాంటి వంటలు మీరూ ప్రయత్నించండి.
గారెలు
కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పొత్తులు – నాలుగు, ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – ఒక టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – 10 నుంచి 12, పచ్చిమిర్చి – ఏడెనిమిది, సన్నని కరివేపాకు తరుగు – కొద్దిగా, ఉల్లిగడ్డ – రెండు, కొత్తిమీర తరుగు – రెండు పిడికెళ్లు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – వేయించడానికి తగినంత.
తయారీ విధానం: ముందుగా కాస్త లేతగా ఉండే తాజా మొక్కజొన్న పొత్తులను తీసుకుని వాటి నుంచి గింజలను ఒలుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గుడ్డతో తుడిచి జల్లిగిన్నెలో వేసి పక్కనుంచాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ధనియాలు, జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మొక్కజొన్న గింజలు వేసి నీరు పోయకుండా మధ్యమధ్యలో కలుపుతూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని తీసుకోవాలి. అందులో సన్నని కరివేపాకు తరుగు, వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ పలుచగా ఉంటే రెండు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండిని వేసి కలపాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. తర్వాత పిండిలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ గారెల్లా వేసుకోవాలి. వేయించుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుని అర నిమిషం పాటు ఉంచి ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
ఇడ్లీలు
కావాల్సిన పదార్థాలు: పావుకిలో – మొక్కజొన్నపిండి, పావు లీటర్ – పెరుగు, రెండు టీస్పూన్లు – నూనె, రెండు టేబుల్ స్పూన్లు – కొత్తిమీర తురుము, రెండు రెబ్బలు – కరివేపాకు, టీస్పూన్ – మినపప్పు, టీస్పూన్ – శనగపప్పు, అరటీస్పూన్ – ఆవాలు, రెండు – పచ్చిమిర్చి, టీస్పూన్ – అల్లం తురుము, ముప్పావు టీస్పూను – బేకింగ్ సోడా, టీస్పూన్ – ఉప్పు.
తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లంను వీలైనంత సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే పెరుగులో కొన్ని నీళ్లు పోసి కాస్త పలుచగా గిలకొట్టుకుని పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి. కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అందులో మొక్కజొన్నపిండి వేసి రెండు నిమిషాల పాటు లో టూ మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ మాడిపోకుండా చక్కగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించి చల్లార్చుకున్న మొక్కజొన్నపిండి, గిలకొట్టిన పెరుగు, సన్నని కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా చేసుకుని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తర్వాత పిండిలో బేకింగ్‌సోడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీరు పోసి స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోవాలి. ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్‌కి కాస్త నెయ్యి రాసుకొని పిండిని వేసుకోవాలి. తర్వాత వాటిని ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు పావుగంట పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీలు మంచిగా ఉడికిన తర్వాత బయటకు తీసుకుని కొత్తిమీర లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలు. సూపర్ టేస్టీగా ఉండే మొక్కజొన్న ఇడ్లీలు సిద్ధం.
సమోసా
కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు – కప్పు, మైదా లేదా గోధుమపిండి – కప్పు, పచ్చిమిర్చి – మూడు, సన్నని అల్లం తరుగు – చెంచా, మిరియాల పొడి – చెంచా, జీలకర్రపొడి – అరచెంచా, గరంమసాలా – చెంచాన్నర, శనగపిండి – చెంచా, ఉప్పు – టేస్ట్‌కి సరిపడా, ఆయిల్ – వేయించడానికి తగినంత, సన్నని కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా మొెక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు రెడీ చేసుకొని పక్కనుంచాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లో మైదా లేదా గోధుమపిండి వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపి 20 నిమిషాలు పక్కనుంచాలి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నెలో మొక్కజొన్న గింజలు, తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కాస్త చల్లార్చుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే శనగపిండిని వేయించుకొని పక్కనుంచాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో చెంచా నూనె వేసుకొని వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న గింజలు, ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే వేయించిన శనగపిండి, మిరియాల పొడి, గరంమసాలా, జీలకర్రపొడి, కొత్తిమీర తరుగు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నింటినీ మూడు నాలుగు నిమిషాలు లో టూ మీడియం ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న చపాతీల్లా చేసుకోవాలి. తర్వాత వాటిని సమోసా షేప్‌లో మడతపెట్టి అందులో మొక్కజొన్న గింజల మిశ్రమాన్ని సరిపడా వేసుకొని అంచులకు కాస్త నీరు అద్ది చక్కగా క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటను తగ్గించి ముందుగా రెడీ చేసుకున్న సమోసాలాను వేసుకోవాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వెంటనే తిప్పేయకుండా కాసేపు కాలనిచ్చి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బయటకు తీసుకుంటే చాలు.
కట్‌లెట్
కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ – కప్పు, క్యారెట్ – సగం ముక్క, క్యాప్సికం – సగం, ఉల్లిగడ్డ – ఒకటి, కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీస్పూను, కారం – అర టీస్పూను, ధనియాల పొడి – అర టీస్పూను, జీలకర్ర పొడి – అర టీస్పూను, ఉప్పు – సరిపడా, ఆలుగడ్డలు – రెండు, బ్రెండ్ క్రంబ్స్ – పావు కప్పు, కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆలుగడ్డలు వేసుకోవాలి. అవి మునిగేంతవరకు నీరు పోసి లో టూ మీడియం ఫ్లేమ్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు మొక్కజొన్న గింజలను ఒలిచి తీసుకోవాలి. మిక్సీజార్‌లోకి మొక్కజొన్న గింజలు వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే క్యారెట్‌ను సన్నగా తురుముకోవాలి. క్యాప్సికంలోని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. ఆలూ మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మొక్క జొన్న గింజలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఉడికించిన ఆలుగడ్డలను మెత్తగా మెదిపి వేసుకుని పదార్థాలన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బ్రెండ్ క్రంబ్స్, కార్న్‌ఫ్లోర్ వేసి సాఫ్ట్ ముద్ద వచ్చేవరకు కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు చేతికి నూనె రాసు కుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుని ముందు రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. ఆ తర్వాత కట్‌లెట్ షేప్‌లో ప్రెస్ చేసుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని కాగిన నూనెలో వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మొక్కజొన్నతో మస్తుగా..
- Advertisement -
- Advertisement -