– అధిక ఉష్ణోగ్రతలతో ఆవిరవుతున్న నీటిమట్టాలు
– గ్రామాలు, చెంచుపెంటల్లో తాగునీటి ఎద్దడి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండలకు జలాశయాలు వట్టిపోతున్నాయి. శ్రీశైలం, జూరాల వంటి ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా తగ్గిపోతున్నాయి. చెరువులు, కాల్వలు ఎండిపోయాయి. అదేవిధంగా నల్లమల అటవీప్రాంతంలో ఉన్న 130 చెంచు పెంటల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. తాగునీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జూరాల సమీపంలో ఉన్న వనపర్తి శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో మిగతా ప్రాంతాల్లో మరింత నీటి కొరత ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఎండ వేడిమికి చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు వేగంగా ఇంకిపోతున్నది. ప్రధాన రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో రబీలో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొల్లాపూర్ సమీపంలో కూతవేటు దూరంలో ఉన్న పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాల పరిధిలోనే 30 వేల ఎకరాల వరి, మొక్కజొన్న, పంటలు ఎండిపోయాయి. వేసవిలో పశువులకు నీటితో పాటు పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి గొర్లకా పరులు నల్లమల అడవిలోకి మేత కోసం గొర్రెలను తరలిస్తున్నారు. అడవిలోనూ తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందంటున్నారు. శ్రీశైలం రిజర్వాయరు నీటి మట్టం తగ్గడంతో తాగునీటికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లో మోటార్లను ఇప్పటికే నిలిపేశారు. జూరాల పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.05 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం, జూరాల నీటిలో ప్రస్తుతం సగం ఒండ్రు మట్టి ఉంది. మిగతా సగం తాగునీటికి మాత్రమే ఉపయో గపడుతోంది. వనపర్తి సప్తసముద్రాలలో సైతం నీటి నిల్వలు పడిపోయాయి. దీంతో త్వరలో మొదలయ్యే ఖరీఫ్‌కు సాగునీటి గండం ఏర్పడే అవకాశాలున్నాయి.
పడిపోయిన భూగర్భ జలాలు
ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోతున్నాయి. 500 అడుగుల బోర్లు వేసినా నీరు రావడం లేదు. 20 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయా యని అధికారులు చెబుతున్నారు. చెరువులు వెల వెల బోతున్నాయి. కృష్ణానదికి ఉపనది అయిన దుందుభీ నది ఎండిపోయింది. నల్లమల ప్రాంతలో ఉండే చెంచు లు, మైదాన ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఇక్కడ సుమారు 80 వేల మంది జీవిస్తున్నారు. నీటి సమస్య ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులకు తాగునీరు సరఫరా చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవాలి
పుట్ట ఆంజనేయులు,
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, వనపర్తి
పక్కనే జూరాల ఉన్నా ఈ జిల్లా ప్రజలకు సాగునీరు అందడం లేదు. ముఖ్యంగా వనపర్తి సమీప గ్రామాల్లో వారానికి ఒకసారి తాగునీరు ఇస్తున్నారు. నీటికొరత ఉన్న గ్రామాలలోని ప్రజల దాహార్తి తీర్చడానికి ట్యాంకుల ద్వారా నీటిని అందించాలి. జిల్లా అధికారులు తాగునీటి ఎద్దడిపై సమీక్ష చేసి సహాయక చర్యలు తీసుకోవాలి.
వట్టిపోతున్న జలాశయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES