మండల పశుసంపద సహాయకులు దాసరి శంకర్
నవతెలంగాణ – టేకుమట్ల
జీవాలకు కడుపులో ఉన్న నట్టలను నివారించుకున్నట్లయితే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే ఉచిత నట్టల మందులను సద్వినియోగం చేసుకొని జీవాలకు తప్పక త్రాగించుకోవాలని పశు వైద్య, పశుసంవర్ధక శాఖ,పశు ఆరోగ్య ఉపకేంద్రం, మండల పశుసంపద సహాయకులు దాసరి శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని ఆరెపల్లి గ్రామంలో జీవాలకు ఉచిత నట్టల నివారణ మందులను త్రాగిపించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరెపల్లి గ్రామ సర్పంచ్ కుర్రె మల్లయ్య యాదవ్ పాల్గొని జీవాలకు నట్టల మందులను త్రాగిపించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పశు సంపద సహాయకులు దాసరి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే ఉచిత నట్టల నివారణ మందులను గొర్రెల మేకల పెంపక దారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో గొర్రెలకు మేకలకు కడుపులో నట్టల మందును వేసినట్లయితే జీవాలను అనేక రోగాల నుండి రక్షించుకోవచ్చునని రైతులకు సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గొర్లకు మేకలకు క్రమం తప్పకుండా నట్టల మందును త్రాగించుకోవాలని తెలిపారు. గ్రామ సర్పంచ్ కుర్రె మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ .. జీవాలకు కానీ పశువులకు కానీ ఏదైనా వ్యాధి సోకినట్లయితే సంబంధిత టేకుమట్ల పశుసంవర్ధక శాఖ, పశు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరెపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నిమ్మల బిక్షపతి,గొర్రెల మేకల పెంపకదారులు, భాష బోయిన రాజయ్య, కుర్రె వీరయ్య, మూడెత్తుల సదయ్య, గజ్జి చిన్న మల్లయ్య, వంగ రామస్వామి ,తదితరులు పాల్గొన్నారు.



