యార్డు వ్యర్థాలతో 16 గ్రామాల ఇబ్బందులు
రోడ్లను కమ్మేస్తున్న పొగ.. వ్యాధుల భయం
అటకెక్కిన గత ప్రభుత్వ హామీ
ఇప్పటికైనా పట్టించుకోవాలని వేడుకోలు
‘యార్డు తరలింపే మా ఊపిరి’ నినాదంతో పోరుకు సిద్ధం
నవతెలంగాణ-కాజీపేట
వరంగల్ మహానగరానికి తలమానికంగా ఉండాల్సిన కాజీపేట మండలం మడికొండ నేడు ‘విష వ్యర్థాల నిలయం’గా మారింది. 15 ఏండ్లుగా కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పుడు మడికొండతోపాటు చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజల ఊపిరి సమస్య అయింది. స్వచ్ఛమైన గాలి, నీరు అందని తరుణంలో.. ‘యార్డు తరలింపే మా ఊపిరి’ అంటూ ప్రజలు ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల నుంచి రోజూ సుమారు 400 టన్నుల చెత్త మడికొండకు చేరుతోంది. ఇందులో తడి, పొడి చెత్త మాత్రమే కాకుండా, ఆస్పత్రుల నుంచి వచ్చే ప్రమాదకరమైన బయో-మెడికల్ వ్యర్థాలు, పరిశ్రమల రసాయన వ్యర్థాలు, జంతు కళేబరాలు, మాంసం విక్రయశాలల వ్యర్థాలతో ఇక్కడ చెత్త కుప్పలు ఇండ్ల ఎత్తును మించి గుట్టలుగా పేరుకుపోయాయి.
వర్షాకాలంలో ఈ కుప్పల నుంచి వచ్చే కుళ్లిన నీరు స్థానిక చెరువులు, కుంటల్లో కలవడంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే విష వాయువులు, నిరంతరం చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే దట్టమైన పొగతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడుతున్న పరిస్థితి. రాత్రి వేళల్లో వెలువడే పొగ ప్రధాన రహదారిని కమ్మేయడంతో వాహనదారులకు దారి కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరోవైపు మూగ జీవాలు, చేపలు, పక్షులు ఈ కాలుష్యానికి బలైపోతున్నాయి. యార్డు ఏర్పాటు సమయంలో నాటి ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎత్తైన ప్రహరీ నిర్మించి, వ్యర్థాలను ఎప్పటికప్పుడూ రీసైక్లింగ్ చేసి విద్యుత్, ఎరువులు తయారు చేస్తామని చెప్పి విస్మరించారు. క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడంతో అది కేవలం ‘ఓపెన్ డంపింగ్’గా మిగిలిపోయింది. డంపింగ్ యార్డ్ అడహక్ కమిటీ నాయకులు కలెక్టరేట్‌లో వినతిపత్రాలు సమర్పించినా, అధికారులు పరిశీలిస్తామనే మూస ధోరణిలోనే ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐక్య పోరాటానికి సిద్ధం
ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని అడహక్ కమిటీ పిలుపునిచ్చింది. మడికొండ నుంచి డంపింగ్ యార్డ్‌ను జనావాసాలకు దూరంగా తరలించడమే శాశ్వత పరిష్కారమని కమిటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. మడికొండ ప్రజల ఆరోగ్య హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు మారుతున్నా, అధికారులు మారుతున్నా మడికొండ తలరాత మారడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
ఉద్యమాలు నిర్వహిస్తాం : ఎం.చుక్కయ్య- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
మడికొండ డంపింగ్ యార్డ్ విషయాన్ని జెడబ్ల్యూఎంసీ అధికారులు ఆషామాషీగా తీసుకుంటున్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసే విషయంలో వివిధ కారణాలను సాకుగా చూపి విఫలమవుతున్నారు. గతంలో రూ.58 లక్షల జీడబ్ల్యూఎంసీ నిధులతో మేయర్ గుండు సుధారాణి నాయకత్వంలో పాలకమండలి మహారాష్ట్రకు స్టడీస్ టూర్‌కి వెళ్లారు. కానీ ఫలితం శూన్యం. డంపింగ్ యార్డ్‌ను సుదూర ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కావ్య స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి. లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలిసొచ్చే పార్టీలను సంఘాలను అన్నిటిని కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తాం.
తరలింపే పరిష్కారం
మడికొండలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేటప్పుడు దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ నిర్మించి ఏరోజు చెత్తను ఆరోజే రీసైక్లింగ్ చేసి ఎరువు, విద్యుత్ ఉత్పత్తి చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డంపింగ్ యార్డు నుంచి వెలువడే దట్టమైన పొగ రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మడికొండ ప్రధాన రహదారిని కమ్మేస్తోంది. డంపింగ్ యార్డు సమస్యపై గతంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నో వినతి పత్రాలు సమర్పించాం. వారు హామీలు ఇస్తున్నారు తప్ప పనులు కావడం లేదు. ఇదే విషయమై హన్మకొండ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందచేసి సమస్యలు పరిష్కరించాలని కోరాం.
-ఎర్రగట్టు స్వామి, పి.వెంకట్‌రావు
-కాజీపేట డంపింగ్ యార్డు అడహక్ కమిటీ నాయకులు



