ఐదవ తరగతి క్లాస్ రూంలో విద్యార్థులంతా రేపటినుంచి మనకు సమ్మర్ హాలిడేస్ అంటూ కేరింతలతో తెగ సందడి చేస్తున్నారు. అప్పుడే క్లాస్ రూంలోకి వచ్చిన జయప్రద మేడమ్‌ను చూసి ఒక్కసారిగా పిల్లలంతా లేచి నిలబడి సంతోషంతో గట్టిగా గుడ్ మార్నింగ్ మేడమ్ అంటూ విష్ చేశారు. మేడమ్ కూడా చిరునవ్వులు చిందిస్తూ వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అంటూ కూర్చోమని సైగచేశారు. మరి సెలవుల్లో ఏంచేద్దాం అనుకుంటున్నారో చెప్పమని పిల్లలను అడగ్గా తమ బంధువుల ఊళ్ళకు వెళ్లి ఎంజారు చేస్తాం మేడమ్ అన్నారు పిల్లలు. అంతలోనే స్వప్నిక లేచి సెలవుల్లో ఎలా వుండాలో కొంచెం చెప్పండి మేడమ్ అని అడిగింది. ఇక పిల్లలందరూ నిశ్శబ్దంగా వుండగా మేడమ్ ‘పిల్లలూ… ఇది సమ్మర్. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనమంతా హ్యాపీగా వుండాలి. ఎప్పుడైనా మనం బాగుంటూ మన చుట్టూ ప్రక్కల సమాజం బాగుండేలా చూడాలి. అందువల్ల మీరంతా మొదట ఆరోగ్యంగా వుండాలంటే వాటర్ బాగా తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేడితీవ్రత తక్కువగా వున్నప్పుడే బయట ఆడుకోవాలి. ఇంట్లో మీకిష్టమైన ఇండోర్ గేమ్స్ ఆడుకోండి. మొబైల్ ఫోన్ తక్కువగా చూడండి. మీ ఇంట్లోని పెద్ద వాళ్లతో నేటి సైన్స్ అండ్ టెక్నాలజీ, మోరల్ వాల్యూస్, మన దేశ గొప్పతనం గురించి తెలుసుకోండి.
ఫ్రూట్స్ బాగా తినండి. మీ అందరికీ బాగా ఇష్టమైన మామిడి పండ్ల కాలం ఇది. ప్రతిరోజు ఓ రెండు ఇంగ్లీష్, తెలుగు కొత్త పదాల గురించి తెలుసుకోండి. చిన్న చిన్న కథలు, కొత్త కొత్త సంగతులు మీ ఇంట్లో పెద్ద వారి దగ్గర చెప్పించుకోండి. మీకు ఇష్టమైన మంచి సినిమాలు చూడండి. పిల్లల పుస్తకాలు, మన దేశ సైంటిస్టులు, వివేకానంద, గాంధీజీ, అంబేద్కర్ వంటి మహానుభావుల జీవిత చరిత్రలను చదువుతూ స్ఫూర్తి పొందుతూనే సెలవులను సరదాగా గడపండి. అప్పుడప్పుడూ నాకు ఫోన్ చేయడం మర్చిపోకండి’ అంటూ ముగిస్తుండగా… అంతలోనే అమూల్య లేచి, మేడమ్ మరీ సమాజం కోసం మేం ఏంచేయాలి అని అడిగింది. వెంటనే మేడమ్.. వెరీ గుడ్ అమూల్య అంటూ.. మీరంతా హ్యాపీగా వుంటే సమాజం కూడా సంతోషంగా వుంటుంది. మీరే రేపటి తరం ఈ దేశ నిర్మాతలు. మనమంతా ఈ సమ్మర్‌లో మన ఇండ్ల దగ్గర ఒక మొక్క నాటుదాం. బాధ్యతగా నీళ్ళు పోసి మొక్కను పెంచుదాం. ఇప్పుడు మనం అందరం కలిసి మన పాఠశాల ఆవరణలో ఈ సంవత్సరం మీ ఐదవ తరగతికి గుర్తుగా ఓ మొక్క నాటుదాం…! ఓకేనా అంది మేడమ్. వెంటనే పిల్లలంతా గట్టిగా ఓకే మేడమ్ అంటూ స్కూల్ గ్రౌండ్‌లోకి మొక్క నాటడానికి వెళ్ళారు.
- ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536