నవతెలంగాణ – హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా రూ. 110 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తొలుత 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులను మాత్రమే తిప్పినట్లు అధికారులు తెలిపారు.
పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సులకు ఈసారి 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేశారు. గత ఏడాది ఇదే పండుగ సమయంలో 6,300 ప్రత్యేక బస్సులు నడపగా, రూ. 114 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని, ప్రయాణికులు కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 5, 6 తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించింది.