ఇజ్రాయిల్ మారణకాండకు నిరసనగా..
గాజాలో బేషరతుగా కాల్పుల విరమణ జరగాలి
పాలస్తీనియన్ల సాయంపై ఇజ్రాయిల్ ఆంక్షలు ఎత్తివేయాలి
భద్రతా మండలి తీర్మానం.. వీటో చేసిన అమెరికా
ఆమ్ట్సాడమ్, ఐక్యరాజ్యసమితి : గాజాపై ఇజ్రాయిల్ జరుపుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు దేశాలు, మానవ హక్కుల సంఘాలు గళం వినిపిస్తున్నాయి. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం గా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా డచ్ పార్లమెంటు సమావేశా ల్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. ఇజ్రాయిల్ మారణ కాండను నిరసిస్తూ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఓ డచ్ ఎంపీ
పాలస్తీనా జెండాలోని రంగులతో కూడిన దుస్తులు ధరించి వచ్చింది. అయితే ఆ దుస్తులు మార్చుకొని రావాలంటూ ఎంపీ ఎస్తేర్‌ను సభలో ఆదేశించారు. ఆమెను సభ నుంచి బయటకు పంపించేశారు. దీంతో బయటకు వెళ్లిన ఆమె.. తిరిగి ఎరుపు రంగు అంగీని ధరించి సభలోకి వచ్చారు.ఇక ఇజ్రాయిల్ దారుణ చర్యలకు అమెరికా బాసటగా నిలుస్తున్నది. తన వీటో అధికారాన్ని ఉపయోగించి తాజాగా ఐక్యరాజ్యసమితిలో భద్రతా మండలి తీర్మానాన్ని వీగిపోయేలా చేసింది.
గాజాలో తక్షణమే, బేషరతుగా, శాశ్వత కాల్పుల విరమణ జరగాలని, అలాగే గాజా ప్రజలకు అందే సాయంపై విధించిన ఆంక్షలన్నింటినీ ఇజ్రాయిల్ ఎత్తివేయాలని కోరుతూ భద్రతా మండలి ఈ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. అయితే ఈ తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. దీంతో తీర్మానం వీగిపోయింది. 15మంది సభ్యులు గల భద్రతా మండలిలో 10మంది సభ్యులు ఈ తీర్మానాన్ని రూపొందించారు. అలాగే బందీలందరినీ వెంటనే, బేషరతుగా, గౌరవంగా విడుదల చేయాలని కూడా తీర్మానం కోరింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 14ఓట్లు వచ్చాయి. దాదాపు రెండేండ్లుగా సాగుతున్న గాజా యుద్ధంపై భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా ఇలా వీటో చేయడం ఇది ఆరోసారి.గాజాలో క్షామం నెలకొందని అంచనాలు వేయడం కాదు, ప్రకటించడం కాదు, ధ్రువీకరించబడిందని డెన్మార్క్ రాయబారి క్రిస్టినా మార్కస్ లాసెన్ వ్యాఖ్యానించారు. ఓటింగ్‌కు ముందు ఆమె మండలిలో మాట్లాడారు. ఇజ్రాయిల్ తీసుకుంటున్న చర్యలతో అక్కడ విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్లనే మనం నేడు చర్యలు తీసుకోవడానికి ఇక్కడ సమావేశం కావాల్సి వచ్చిందన్నారు. మరోవైపు హమాస్ వల్లనే ఈ యుద్ధం జరుగుతోందని అమెరికా రాయబారి వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ దాడుల్లో మరో 20 మంది బలి
ఇజ్రాయిల్ జరుపుతోన్న నిరంతర దాడులకు మరో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. హమాస్‌ను అంతం చేస్తామన్న పేరుతో గత రెండేండ్లుగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ జరుపుతోన్న దాడులతో ఇప్పటికే 65వేలకు పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అలాగే 1.65 లక్షల మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయిల్ తాజాగా చేపడుతోన్న సైనిక చర్యలతో గాజాలోని ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది నగరాన్ని విడిచిపోగా.. మిగిలినవారు కూడా అదే దారిలో పయనిస్తున్నారు. కట్టుబట్టలతో నగరాన్ని వీడుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అనేక కఠిన పరిస్థితుల నడుమ ప్రాణాలను రక్షించుకోవటం కోసం తమ సొంత ప్రాంతాలను వీడి వెళ్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి.గాజాపై పట్టు కోసం ఇజ్రాయిల్ సైన్యం రంగంలోకి దిగి మిలిటరీ చర్యలకు దిగుతోన్నది. తమ యుద్ధనౌకలను గాజా నగరం వైపు మళ్లిస్తున్నది. నగరం నుంచి పౌరులను బలవంతంగా తరలించేస్తున్నది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఇజ్రాయిల్ జరుపుతోన్న డ్రోన్ల ప్రయోగం, యుద్ధ విమానాలతో దాడులు, రిమోట్-కంట్రోల్డ్ రోబోల నుంచి పేలుళ్లతో సహా ఇతర నిరంతర దాడుల గురించి అక్కడి ప్రజలు ‘అల్ జజీరా’ వార్త సంస్థకు తెలిపారు. ఇజ్రాయిల్ సైన్యం ముందుకు సాగుతున్నా కొద్దీ పొరుగు ప్రాంతాలను పేల్చేస్తున్నది.