Wednesday, March 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువేళాపాళా లేని విధులు

వేళాపాళా లేని విధులు

- Advertisement -

– ఆర్టీసీలో నిత్యం 14-16 గంటల డ్యూటీ
– డ్రైవర్‌, కండక్టర్లపై తీవ్ర పని ఒత్తిడి
– ‘మహాలక్ష్మి’తో పెరిగిన ప్రయాణీకుల సంఖ్య
– సిబ్బంది కొరతతో సెలవుల మంజూరుకు కొర్రీలు
– పని ఒత్తిడితో మానసిక సమస్యలు
– సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని డిమాండ్‌
– యూనియన్‌ ఏర్పాటుకు సిబ్బంది విజ్ఞప్తులు
నవతెలంగాణ-భిక్కనూర్‌
సురక్షిత ప్రయాణం అందజేస్తున్న టీజీఎస్‌ఆర్టీసీ.. అందుకు కృషి చేస్తున్న డ్రైవర్‌, కండక్టర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. లెక్కకు మించి పనిగంటలు డ్యూటీ చేయిస్తుండటంతో సిబ్బంది తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. సరిపడా సిబ్బంది లేక.. ఉన్న వారిపై అదనపు పనిభారం పడుతున్నది. అత్యవసరమై సెలవులు అడిగితే ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. పండుగలన్నీ రోడ్లమీదే గడిచిపోతున్నాయని వాపోతున్నారు. అదనంగా సిబ్బందిని నియమించి తమపై పనిభారం తగ్గించాలని డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. వేధింపులకు గురి చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. గుర్తింపు యూనియన్‌ లేకపోవడంతో తమ గోడు వెల్లబోసుకోలేకపోతున్నామంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీజీఎస్‌ఆర్టీసీ) రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు, 3 మినీ డిపోలు ఉండగా.. 10 వేలకుపైగా డ్రైవర్లు, కండక్టర్లు, 38 వేలకుపైగా ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా కొన్నేండ్లుగా డ్రైవర్‌, కండక్టర్‌ల నియామకం లేకపోవడంతో ఉన్న వారిపై అదనపు పనిభారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరగడంతో బస్సులు కిక్కిరుస్తున్నాయి. దాంతో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

సెలవుల మంజూరుకు కొర్రీలు
సెలవుల మంజూరులోనూ అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీలో డ్రైవర్‌లు, కండక్టర్‌లు బంధువుల ఇండ్లల్లో జరిగే
శుభకార్యాలకు ఎప్పుడో దూరం కాగా.. దగ్గరి చుట్టాలు చనిపోతే చివరి చూపు చూసేందుకు సైతం ఎంతో ప్రయాస పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. బంధువులు చనిపోయారని సెలవు అడిగితే.. మృతదేహంతో సెల్ఫీ దిగి పెడతారా? అన్నట్టుగా అడుగుతున్నారని అన్నారు. తాము కూడా పై వారికి సమాధానం చెప్పుకోవాలని అంటున్నారు. పుట్టెడు శోఖంలో ఉంటే సెల్ఫీ ఎలా పెట్టాలని డ్రైవర్లు, కండక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్‌ రిపోర్టులు చూపించినప్పటికీ సెలవులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. హైదరాబాద్‌ తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని, అక్కడి డాక్టర్‌ సూచించిన ఆస్పత్రికే వెళ్లాలని నిబంధనలు ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే సెలవులు మంజూరు చేయడం లేదని వారు పేర్కొంటున్నారు. తమ సమస్యను ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు వినాలని కోరుతున్నారు. తమపై అదనపు భారం పడకుండా వెంటనే డ్రైవర్‌, కండక్టర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్‌ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు.

నియామకాలు లేక ఉన్న వారితోనే విధులు
కాగా ఆర్టీసీలో కొన్నేండ్లుగా నియామకాలు చేపట్టలేదు. గతంలో రూట్‌ల వారీగా డబుల్‌ డ్యూటీ చేస్తే తర్వాతి రోజు సెలవు మంజూరు చేసే వారు. కానీ ప్రస్తుతం డబుల్‌ డ్యూటీ చేసినా మరుసటి రోజు సింగిల్‌ డ్యూటీ వేస్తున్నారని డ్రైవర్‌ల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పని గంటలకైతే ఆర్టీసీలో లెక్కే లేకుండా పోతోందని వాపోతున్నారు. నిత్యం 14-16 గంటలు పని చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేర్లు చెప్పి సమస్యను ప్రస్తావించడానికి డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -