Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంఈ-వేస్ట్‌ మాయ

ఈ-వేస్ట్‌ మాయ

- Advertisement -

రీసైక్లింగ్‌ ప్లాంట్లలో భారీ స్కాం?
ప్రభుత్వామోదిత కేంద్రాల్లో 75 శాతం ఉనికిలోనే లేవు
అయినా.. ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు చూపిస్తున్న వైనం
రూ. కోట్లు విలువ చేసే ఈపీఆర్‌ క్రెడిట్లు పొందుతున్న తీరు
ఆ తర్వాత టాప్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు తక్కువ మొత్తానికే విక్రయం

భారత్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో పాటే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ-వేస్ట్‌) కూడా అధికం అవుతున్నాయి. దీంతో దేశంలో ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ తప్పనిసరిగా మారింది. ఇందులో భాగంగా ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ కోసం ప్రభుత్వం పలు ప్లాంట్లకు అనుమతిస్తోంది. అయితే ఇలా ఏర్పాటైన ప్లాంట్లలో స్కాం జరుగుతున్నట్టు ఓ దర్యాప్తులో వెల్లడైంది. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆమోదం తెలిపిన 41 రీసైక్లింగ్‌ ప్లాంట్లలో 31 ప్లాంట్లు, అంటే 75 శాతం అసలు ఉనికిలో లేకపోవటం, లేదా నకిలీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సదరు దర్యాప్తులో బహిర్గతమవటం గమనార్హం.
న్యూఢిల్లీ : యూపీలోని బులంద్‌షహర్‌ జిల్లాలో ప్రభుత్వం ఆమోదం పొందిన మూడు ప్లాంట్లు.. నిర్దేశిత చిరునామాలో లేవు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాటిని రెండుసార్లు ‘పరిశీలించటం’, ‘ఆమోదించటం’ చేసినట్టు వెల్లడికావటం గమనార్హం. ఇక మీరట్‌లోని ఇండిస్టియల్‌ క్లస్టర్‌లో 15 ప్లాంట్లలో ఎలాంటి కార్యకలాపాలూ లేవు. అక్కడ చిమ్నీలు నిశబ్దంగా దర్శనమిచ్చాయి. కొంత మంది కార్మికులు మాత్రమే అక్కడ కనిపించటం గమనార్హం. యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌లలో నిష్క్రియాత్మకంగా లేదా ఉనికిలో లేని 31 ప్లాంట్ల పరిస్థితీ ఈ విధంగా ఉన్నది. ఇవి కాగితాల మీద మాత్రమే పని చేస్తున్నట్టు కనబడతాయి. లక్షల మెట్రిక్‌ టన్నుల ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తున్నట్టు ఉంటాయి. కానీ వాస్తవానికి అక్కడ జరిగేది ఏమీ ఉండదు.

రూ.కోట్ల విలువ చేసే ఈపీఆర్‌ క్రెడిట్స్‌
అంతేకాదు.. ఈ ప్లాంట్లు కీలకమైన ట్రేడబుల్‌ ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్‌) క్రెడిట్‌లకు కూడా అర్హత పొందుతున్నాయి. కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)కి తగిన పత్రాలు, ఇన్‌వాయిస్‌లు, వారి కార్యకలాపాల ఫొటోలను అందించటం ద్వారా మాత్రమే ఇలాంటి ఈపీఆర్‌ క్రెడిట్లను సదరు ప్లాంట్లు(రీసైక్లర్లు) పొందుతాయి. రూ. వందల కోట్ల విలువ చేసే ఈ ఈపీఆర్‌ క్రెడిట్స్‌ను రీసైక్లర్లు టాప్‌ ఎలక్ట్రానిక్‌ బ్రాండ్ల కంపెనీలకు విక్రయిస్తారు. చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన రీసైక్లింగ్‌ టార్గెట్లను చేరుకోవటానికి ఈ ఈపీఆర్‌లు సదరు ఎలక్ట్రానిక్‌ బ్రాండ్‌ కంపెనీలకు దోహదం చేస్తాయి.

ఏమిటీ ఈ ఈపీఆర్‌ క్రెడిట్స్‌?
ఈపీఆర్‌ క్రెడిట్‌ అంటే తయారీ కంపెనీలపై ప్రభుత్వం విధించిన ఒక బాధ్యత లేదా విధి. అంటే.. ఒక ఎలక్ట్రానిక్‌ కంపెనీ తన ఉత్పత్తులను.. అంతే మొత్తంలో లేదా ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రీసైక్లింగ్‌ ప్రక్రియను ఎలక్ట్రానిక్‌ కంపెనీలు తమంతట తాము చేయొచ్చు. లేదా ఒక సంస్థను నియమించుకోవచ్చు. లేదా పైన తెలిపినట్టుగా ప్రభుత్వామోదిత రీసైక్లర్ల నుంచి ఈపీఆర్‌ క్రెడిట్లను కొనుగోలు చేయటం ద్వారా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు తమ లక్ష్యాలను చేరుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు స్కాం మొదలవుతున్నది. కాగితం మీదనే ఉండి.. ఉనికిలో లేని రీసైకిల్‌ ప్లాంట్ల నుంచి తక్కువ మొత్తంలో ఈపీఆర్‌ క్రెడిట్లను దక్కించుకొని కోట్ల రూపాయలను ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు పోగు చేసుకుంటున్నాయి.

నిర్దేశిత ధర కంటే తక్కువకు ఈపీఆర్‌ క్రెడిట్లు విక్రయం
ఈ 31 ప్లాంట్లను 24 కంపెనీలు నడుపుతున్నాయి. ఇవి ఏడాదికి 8.49 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ఈ-వేస్ట్‌ను రీసైకిల్‌ చేస్తాయి. రూ.1800 కోట్ల విలువైన ఈపీఆర్‌ క్రెడిట్లను ఈ ప్లాంట్లు జనరేట్‌ చేస్తాయి. ఈ ప్లాంట్లను నడుపుతున్న కంపెనీలు టాప్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్లకు ఈపీఆర్‌ క్రెడిట్లను విక్రయించాయి. అధికారిక రీసైక్లింగ్‌ ఖర్చు లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే చాలా తక్కువగా ఈ లావాదేవీలు ఉన్నాయి. కేజీ ఈ-వేస్ట్‌కు రూ.22 చొప్పున చెల్లించాలని ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కంపెనీలను సీపీసీబీ ఆదేశించింది. అయితే ఇవి కేజీకి రూ.6-8 మధ్యనే చెల్లించి ఈపీఆర్‌ క్రెడిట్లను పొందుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్లాంట్ల పని తీరు పట్ల అందరిలోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డొల్ల ప్లాంట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనిఖీల విషయంలో రాజీ పడ్డాయా? టాప్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు వందల కోట్ల రూపాయలను ఆదా చేయటమే ప్రభుత్వాల వ్యూహమా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -