గ్లోబల్ సమ్మిట్‌కు అత్యంత అధునాతన డ్రోన్లు వినియోగం
ఆధునిక కంట్రోల్ రూమ్‌తో అధికారుల పర్యవేక్షణ
42 పాయింట్లుగా విభజించి
కట్టుదిట్టమైన భద్రత
ప్రధాన వేదికకు అక్టోపస్ రక్షణ
సెక్యూరిటీని మరోసారి సమీక్షించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అత్యంత ఆధునిక డ్రోన్ల సహాయంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం డేగ కన్ను వేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో సోమ, మంగళవారం రెండ్రోజుల పాటు సాగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అడుగడుగునా సాయుధ పోలీసులతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సమ్మిట్ ప్రాంగణానికి వెళ్లే మార్గాలలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీతో పాటు సిటీ సెక్యూరిటీ విభాగాలకు చెందిన సాయుధ పోలీసులతో అడుగడుగునా కన్నేసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా వచ్చే సమాచారాన్ని సేకరించి వెంటనే అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు.. దాని పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇంచార్జిలుగా నియమించారు. ఆదివారం నుంచే పని చేయడం ప్రారంభించిన ఈ కంట్రోల్ రూమ్ సమ్మిట్ ముగిశాక మరో నాలుగు రోజులపాటు కూడా ఆ ప్రాంగణాన్ని పర్యవేక్షించేలా ఏర్పాట్లను చేశారు.
హౌటళ్ల వద్ద పటిష్టమైన భద్రత
మొత్తం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని 42 యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్‌కు ఇన్‌స్పెక్టర్ లేదా డీఎస్పీ స్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించి ఆ ప్రాంతంలో సాయుధ పోలీసులతో పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లన్నిటికి కూడా డీఐజీ స్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించారు. కాగా దేశవిదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులకు శంషాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ స్టార్‌హౌటళ్ళలో బస ఏర్పాటు చేయడమేగాక ఆ హౌటళ్ళ వద్ద పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బస హౌటళ్ళ నుంచి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి దేశవిదేశీ ప్రతినిధులను ప్రత్యేక బస్సులలో తీసుకువచ్చి, తీసుకెళ్లేలా ఏర్పాట్లను జరిపారు.
అడుగడుగునా సోదాలు
జాతీయ రహదారి నుంచి ప్రాంగణం వైపు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడమేగాక అదనంగా నిఘాను కూడా అడుగడుగునా ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రాంతాన్ని పోలీసు జాగిలాలతో సోమవారం మధ్యాహ్నం సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు అడుగడుగునా యాంటీ బాంబ్ సెర్చింగ్ స్క్వాడ్‌లతో, పోలీసు జాగిలాలతో సోదాలను నిర్వహిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయటమేగాక లోనికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరీక్షించేలా యాంటీ బాంబ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేశారు.
అక్టోపస్ బలగాల చేతికి ప్రధాన వేదిక
ప్రధాన వేదికను పూర్తిగా అక్టోపస్ బలగాలకు అప్పగించారు. ఆ ప్రాంగణాన్ని ఆదివారం నుంచే తమ అదుపులోకి తీసుకున్న అక్టోపస్ బలగాలు.. అనుమతి ఉన్న అధికారులను మాత్రమే లోనికి అనుమతిస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోవైపు గ్రేహౌండ్స్ బలగాలను సైతం ఆ ప్రాంగణాన్ని పర్యవేక్షించేలా మోహరించారు. ముఖ్యంగా ఇటీవలనే ఢిల్లీలో ఉగ్రవాదులు కారుబాంబును పేల్చిన ఘటన నేపథ్యంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల కార్యకలాపాలపై గట్టి నిఘా వేసి ఉంచేలా ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఉన్నతాధికారుల సమీక్ష
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ చీఫ్ విజరు కుమార్, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్ భగవత్‌తో పాటు మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఆదివారం సమీక్ష జరిపి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అక్కడి పరిస్థితిపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఎప్పటికప్పుడు డీజీపీకి సమాచారమిస్తూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం డీజీపీ శివధర్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని స్వయంగా తిరిగి సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ల వద్ద కూడా 24 గంటలు కాపు కాసేలా గ్రేహౌండ్స్‌కు బాధ్యతను అప్పగించారు.
పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాం డీజీపీ శివధర్‌రెడ్డి
రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ సమావేశాలకు ఎలాంటి అవాంతరాలూ ఎదురు కాకుండా అన్ని విధాలా పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలూ ఈ ఏర్పాట్లలో భాగం పంచుకుంటున్నాయని ఆయన తెలిపారు. అదనపు డీజీలు, ఐజీలు, ఎస్పీలు కలిపి మొత్తం 10 మందికి పైగా ఐపీఎస్ అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారని అన్నారు. ఈ బందోబస్తులో ఆరువేల మందికి పైగా పోలీసులు మోహరించామని చెప్పారు.
ఇంటెలిజెన్స్ డేగ కన్ను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


