లేకుంటే ప్రస్తుత మార్కెట్ ధర నిర్ణయించాలి
నర్కూడ గ్రామ సభలో రేడియల్ రోడ్డు భూ బాధితులు
నవతెలంగాణ-శంషాబాద్
భూమికి ప్రత్యామ్నాయంగా భూమి లేదా ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ధర నిర్ణయించి నష్టపరిహారం ఇవ్వకుంటే రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇవ్వబోమని భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. బుధవారం రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా రంగారెడ్డి శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభకు భూ నిర్వాసితులతో పాటు తహసిల్దార్ కే. రవీందర్‌దత్, గ్రామ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్, ఉపసర్పంచ్ నీరటి మహేష్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, ఏసీఎస్ మాజీ చైర్మెన్ బూర్కుంట సతీష్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ఆర్డీవో భూ నిర్వాసితులను ఉద్దేశించి భూ సేకరణ నిబంధనలు చదివి వినిపించారు. భూములు ఇవ్వబోమని భూనిర్వాసితులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములు తీసుకోవాలనుకుంటే ముందు అధికారులు ఏ ప్రాతిపదికను భూములు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
భూమికి భూమి ఇవ్వాలి : సర్పంచ్ గడ్డం శేఖర్‌యాదవ్
నర్కూడ గ్రామపంచాయతీ పరిధిలో భూములు కోల్పోతున్న వారంతా చిన్న సన్నకారు రైతులేనని సర్పంచ్ గడ్డం శేఖర్‌యాదవ్ అన్నారు. అధికారులు సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకొని అమ్మపల్లి రెవెన్యూ 19 సర్వే నెంబర్‌లో భూములు ప్లాట్లు పోయినవారికి ప్లాట్లు, ఇల్లు పోయిన వారికి ఇండ్లు ఇప్పించాలని కోరారు.
భూములు గుంజుకోవడానికి సీఎంలు అవుతున్నారు : నిర్వాసితుడు ముఖిత్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు అప్పటి పాలకులు ఎయిర్‌పోర్టు కోసం 5వేల ఎకరాలకు పైగా భూమి బలవంతంగా తీసుకున్నారని నిర్వాసితుడు ముఖిత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మాజీ సీఎం కేసీఆర్ వివిధ అభివృద్ధి పేర్లతో భూములు గుంజుకున్నారని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ 111 జీవో ఉన్న గ్రామాల్లో కూడా భూములు కాజేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 20ఏండ్లుగా రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములు అభివృద్ధి పేరుతో తీసుకుంటున్నారని అన్నారు.ఉత్తర భారత ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఇక్కడి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న భూమి అంతా గుంజుకుంటే తాము ఎక్కడికి పోవాలని అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి భూమికి భూమి ఇవ్వాలని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
జల వనరులను నాశనం చేస్తున్నారు : సీపీఐ(ఎం) నాయకులు నీరటి మల్లేష్
నర్కూడ గ్రామపంచాయతీ పరిధిలో మూడు జల వనరుల పైనుంచి రేడియల్ రోడ్డు కోసం భూసేకరణ చేస్తున్నారని సీపీఐ(ఎం) నాయకులు నీరటి మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఆలయాలు, బొందల గడ్డలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా పోతున్నాయని తెలిపారు. అవసరం లేని రోడ్డు వేస్తూ ఉన్న భూములను గుంజుకోవడం సరైనది కాదని, ప్రత్యామ్నాయంగా భూమికి భూమి ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం మొండికెళ్తే ఎంతకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
సీఎం ఏరియా అభివృద్ధి కోసమే అవసరం లేని రోడ్డు : పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ రింగ్ రోడ్డు నుంచి నాచారం వరకు 81 కిలోమీటర్లు దూరం రోడ్డు వేస్తున్నారని విమర్శించారు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. భూమికి భూమి లేదా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని సమస్యను సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. రెండు రకాల పద్ధతుల్లో పరిహారం చెల్లిస్తామని, రైతులు ముందుకు వస్తే ఒప్పందం అవార్డు ప్రకారం 30 నుంచి 40 రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. జనరల్ అవార్డు కింద తమకు పరిహారం పట్ల ఇష్టం లేకుంటే ఓటుకు కోర్టుకు వెళ్లి పొందవచ్చని తెలిపారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే భూసేకరణ జరుపుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు కనకమామిడి విష్ణుముదిరాజ్, పర్వతం వెంకటయ్య, పర్వతం వినోద్ కుమార్, చౌట రాజుయాదవ్, బూర్కుంట నాగరాజు, ఆర్‌ఐ లు గుమ్మల కృష్ణ, మహిపాల్‌రెడ్డి, కార్యదర్శి సీహెచ్ శ్రీకాంత్‌గౌడ్, నాయకులు మంచర్ల మోహన్‌రావు, సందనవెల్లి శ్రీనివాస్ తొంట అశోక్, గూడపు వెంకట్ లక్ష్మణరావు, లింగం నవీన్, కర్రే గణేష్, తదితరులు పాల్గొన్నారు. -ఆర్డీఓ వెంకట్‌రెడ్డి



