Monday, September 15, 2025
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో భూకంపం

బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో భూకంపం

- Advertisement -

రిక్టర్‌ స్కేలుపై 5.8 తీవ్రత నమోదు
భూటాన్‌, మయన్మార్‌లోనూ ప్రకంపనలు

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌, అసోం సహా ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై 5.8 తీవ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు నివాసాలు, దుకాణాలు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆదివారం సాయంత్రం 4.41 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం ఉదల్గురి జిల్లాలో ఉంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు తక్షణ నివేదిక లేదని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, జల్పైగురి, డూయర్స్‌, అలిపుర్దువార్‌, కూచ్‌బెహార్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ”కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు అనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా మా ఇంటి నుండి బయటకు పరుగెత్తాను,” అని సిలిగురి నివాసి బికాష్‌ డే చెప్పారు. అసోంలోని గౌహతి, ఉదల్గురి, సోనిత్పూర్‌, తముల్పూర్‌, నల్బారి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించినట్టు తెలిపారు. ఈ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు గౌహతిలోని నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక భూకంప జోన్‌లో ఉండటంతో, తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. కాగా సరిహద్దు దేశాలైన భూటాన్‌, మయన్మార్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -