టిబెట్‌లో భూకంపం

Earthquake in Tibet– 126 మంది మృతి, 188 మందికి గాయాలు
– రిక్టర్‌ స్కేల్‌పై 7.1 గా తీవ్రత నమోదు
– నేపాల్‌, భారత్‌ల్లోనూ ప్రకంపనలు
ఖాట్మండు: హిమాలయ ప్రాంతమైన టిబెట్‌లో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపంలో ఇప్పటివరకు 126 మంది మరణించగా, మరో 188 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవ కాశం వుంది. కాగా నేపాల్‌ సరిహద్దుల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాజధాని ఖాట్మండులో భూమి కంపించింది. దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూమి తీవ్రంగా కంపిస్తుండడంతో భీతిల్లిన ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఉదయం 9.05గంటల సమయంలో చైనాలోని టిబెట్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన జిగాజెలోని డింగ్రి కౌంటీ తీవ్రంగా కంపించింది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుకు 93కిలో మీటర్ల దూరంలో లబుచె ప్రాంతంలో భూకంపం సంభవిం చింది. జిజాంగ్‌ స్వయంప్రతిపత్తి ప్రాం తంలో లెవెల్‌ 2 ఎమర్జన్సీ హెచ్చరిక జారీ చేశారు. ఈ భూకంపం తర్వాత టిబెట్‌ ప్రాంతంలో మరో రెండు ప్రకంపన లు నమోదయ్యాయి. వాటి తీవ్రత 4.7, 4.9గా నమోదైంది. భూకంప కేంద్రం వున్న టిబెట్‌లో పలు భవనాలు నేలమట్ట మయ్యాయి. శిధిలాల కింద పలువురు చిక్కుకు న్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రకంపనల ప్రభా వం భారత్‌పైనా పడింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ సహా పలు చోట్ల భూ ప్రకంపనల వార్తలు వెలువడ్డాయి. భూటాన్‌; బంగ్లాదేశ్‌ల్లో పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
చైనా సాయం
టిబెల్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని పంపినట్టు చైనా అధికార సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. టిబెట్‌లోని అత్యంత ఎత్తయిన ప్రాంతంలో 62 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఎవరెస్ట్‌ శిఖరానికి చైనా వైపున ఉంది. శిథిలాల కింద చిక్కుబడిపోయిన వారిని కాపాడేందుకు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, సాధ్యమైనంత వరకూ ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, బాధితులకు పునరావాస సౌకర్యాలు కల్పిస్తున్నామని చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌ ప్రభుత్వ సీసీటీవీకి తెలియజేశారు. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు 1500 మంది సిబ్బంది కృషి చేస్తున్నారని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న దింగ్రీ బేస్‌ క్యాంప్‌లో సిబ్బంది, పర్యాటకులు సురక్షితంగానే ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు.
2015లో నేపాల్‌లో సంభవించిన పెను భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైంది. సుమారు తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోగా 22 వేల మంది గాయపడ్డారు. దేశంలో ఐదు లక్షలకు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. వాయవ్య చైనాలో 2023 డిసెంబర్‌లో వచ్చిన భూకంపంలో 148 మంది ప్రాణాలు కోల్పోగా గన్సూ రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Spread the love