పూచికత్తు లేకుండా చూడాలి
బడ్జెట్‌లో పన్నులు తగ్గించాలి
ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఏఐఈ లేఖ
ముంబయి : సూక్ష్మ పరిశ్రమలకు పూచీకత్తు లేని రుణాలు ఇవ్వాలని ఆ వర్గాలు డిమాండ్ చేస్తోన్నాయి. అదే విధంగా ఎగుమతి రిస్క్‌ల నుంచి రక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. 2025-26 బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఎంఎస్‌ఎఇ పరిశ్రమలపై పన్నులను తగ్గించడంతో పాటుగా రుణాల లభ్యతను మెరుగుపరచడం వంటి ఉపశమన చర్యలను చేపట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్ (ఎఐఈ)’ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ప్రధానంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్ (సూక్ష్మ పరిశ్రమల) కోసం రూ.10 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణాలను ఇవ్వాలని తెలిపింది. అదే విధంగా రుణాలను 6-7 శాతం వడ్డీ పరిమితితో అందించాలని డిమాండ్ చేసింది.అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్ లేఖా సారాంశం.. ఇటీవలి భౌగోళిక రాజకీయ గందరగోళం, అమెరికా అధిక సుంకాల పరిస్థితుల వల్ల మైక్రో ఎంటర్‌ప్రైజెస్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ఆ ఫలాలు సరిగ్గా అందడం లేదు. ట్రంప్ అనుహ్యాంగా పెంచిన టారిఫ్‌ల వల్ల నష్టపోయిన మైక్రో ఎగుమతిదారులను ఆదుకోవడానికి ‘ఎగుమతి రిస్క్ ఈక్వలైజేషన్ ఫండ్’ను ఏర్పాటు చేయాలి.
అలాగే సుంకాల ఒత్తిడి ఉన్న సమయంలో తాత్కాలిక డ్యూటీలను ఎత్తివేయడంతో పాటుగా వడ్డీ ఉపశమనం కల్పించాలని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఎంట్రప్రెన్యూర్ డిమాండ్ చేసింది.వచ్చే ఏడాది బడ్జెట్‌లో సూక్ష్మ పరిశ్రమలకు ఉన్న రుణ పరిమితులను ప్రభుత్వం సులభతరం చేయాలని ఎఐఎ కోరింది. జిఎస్‌టి నిబంధనలు పాటిస్తున్న యూనిట్లకు వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను ఆటోమేటిక్‌గా పునరుద్ధరించడం ద్వారా సిడ్బీ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రత్యేక సూక్ష్మ రుణాల లక్ష్యాలను నిర్దేశించాలి. ఒత్తిడి సమయాల్లో వడ్డీ రాయితీలు కల్పించాలి. దిగుమతి ప్రత్యామ్నాయ ప్రాజెక్టులకు మద్దతును ఇవ్వడానికి వడ్డీ లేని రుణాలను అందించాలి. రూ.5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన సంస్థలు లేదా రూ.1 కోటి పెట్టుబడి కలిగిన సంస్థలు మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కింద వస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న సూక్ష్మ పరిశ్రమలు దేశంలో దాదాపు 7 కోట్ల పైగా ఉన్నాయి. ఇందులో ఎక్కువ తయారీ, ట్రేడింగ్, సేవా రంగాల్లో ఉన్నాయి. భారత ఎగుమతుల్లో 40-45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈలవే. ఎంఎస్‌ఎంఇలపై దాదాపు 30 కోట్ల మంది ఆధారపడి ఉన్నారని అంచనా.
సూక్ష్మ పరిశ్రమలకు సులభ రుణాలివ్వాలి
- Advertisement -
- Advertisement -



