ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో దిగొచ్చిన ఎన్నికల సంఘం
పాట్నా : బీహార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై ఎన్నికల కమిషన్ వెనక్కి తగ్గింది. ఎలాంటి తప్పనిసరి పత్రాలను సమర్పించకపోయినా ఓటర్ల జాబితాలో పేరును ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని స్థానిక వార్తా పత్రికల్లోనూ ఆదివారం మొదటి పేజీలో భారీ ప్రకటనను ఈసీ ప్రచురించింది. ‘ఓటర్లు అవసరమైన పత్రాలను అందిస్తే.. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) దరఖాస్తును ప్రాసెస్ చేయడం సులభతరం అవుతుంది. ఒకవేళ మీరు (ఓటర్లు) అవసరమైన పత్రాలను అందించలేకపోతే ఈఆర్‌ఓ నిర్వహించే స్థానిక దర్యాప్తు ద్వారా లేదా.. ఇతర డాక్యుమెంట్లు ఆధారంగా ఓటర్ల జాబితాలో పేర్లపై నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రకటనలో తెలిపింది. ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్న తరువాత ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రచురించిన ప్రకటనలో ముందు లైన్‌లో బీఎల్‌ఓ నుంచి ఒనుమరేషన్ ఫారంలు అందుకున్న ఓటర్లు వీలైనంత తర్వగా ఫారంను పూరించి, అవసరమైన పత్రాలు, ఫోటో జత చేసి బీఎల్‌ఓకు అందచేయాలని కోరింది. తరువాత లైన్‌లో అవసరమైన పత్రాలు, ఫోటో అందుబాటులో లేకపోతే, ఫారంను పూరించి బీఎల్‌ఓకు అందచేయండి అని తెలిపింది.
గతంలో ఎస్‌ఐఆర్ కోసం 11 పత్రాలు తప్పనిసరి అని ఇసి ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జనన ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, శాశ్వత నివాసం, అటవీ హక్కులు, కుల ధ్రువీకరణ పత్రాలు, రాష్ట్ర, స్థానిక అధికారులు తయారుచేసిన కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లకు జారీ చేసిన పత్రాలు, అలాగే 1967కి ముందు వివిధ ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన పత్రాలు ఉన్నాయి. వీటిలో ఆధార్, పాన్, గ్రామీణ ఉపాధి జాబ్ కార్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్‌లు లేవు.. పైగా వీటిని ఆమోదించమని ఇసి స్పష్టం చేసింది. దీంతో ఓటర్లు ఈసీ పేర్కొన పత్రాలను సమర్పించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం సాయంత్రానికి కేవలం 1,12,01,674 మంది ఓటర్లు మాత్రమే ఫారంలు సమర్పించారు. ఈ సంఖ్య బీహార్ మొత్తం ఓటర్లలో కేవలం 14.18 శాతం మాత్రమే.
ఇసి మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు తీవ్రగా విమర్శించాయి. ఇసి అధికారులను కలిసి ఎస్‌ఆఆర్‌పై అభ్యంతరం కూడా వ్యక్తం చేశాయి. ఎస్‌ఐఆర్ అసాధ్యామని, ప్రజాస్వామ వ్యతిరేకమని తెలిపాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్‌జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ప్రకటన విడుదల చేసింది. ఒక అధికారి దీనిపై మీడియాతో మాట్లాతూ ‘ఓటర్లు పత్రాలను అందించడంలో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసీ కొన్ని మార్పులు చేసింది. అందుకే ఓటర్ల భౌతిక ధ్రువీకరణ తరువాతే ఇసి తుది నిర్ణయం తీసుకుంటుంది. కనీసం ఓటర్లు ఫోటో లేకపోయినా ఫారమ్ నింపి పత్రాన్ని అభ్యర్థించి బీఎల్‌ఓకు సమర్పించాలి’ అని తెలిపారు.