ఒక్కరోజులో ‘గుర్తించలేని ఓటర్లు’ లక్ష…
24 గంటల్లో మూడు లక్షల ఓట్లు తొలగింపు
గడువు దాటినా పత్రాలు సమర్పించని 15 లక్షలమంది ఓటర్లు
గందరగోళంగా కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు
పాట్నా : బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల 24 గంటల వ్యవధిలో రెండు రకాల గణాంకాలను విడుదల చేయడం ద్వారా సీఈసీ రాజకీయ పార్టీలను మరింత అయోమయంలోకి నెట్టేసింది. బీహార్‌లో ఒక రోజులోనే ‘గుర్తించలేని ఓటర్ల’ సంఖ్య 809 శాతం పెరగడం ఆందోళనను, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నెల 22న రాష్ట్రంలో 11,484 మందిని గుర్తించలేని ఓటర్లుగా ప్రకటించారు. ఆ మరునాటికి (23వ తేదీ) ఆ సంఖ్య లక్షకు చేరింది. అంటే కేవలం 24 గంటల్లోనే ‘గుర్తించలేని ఓటర్లు’ అసాధారణంగా పెరిగారు.
ఎన్నికల బహిష్కరణ యోచన
ఎన్నికల ప్రక్రియను బహిష్క రించే యోచన చేస్తున్నామని ఆర్జేడీ నేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజ కీయ ప్రకంపనలు రేపుతోంది. ప్రజల నుంచి, మిత్రపక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎన్నికల బహిష్కరణపై ప్రతి పక్షాలు నిర్ణయం తీసుకుంటాయని ఆయన తెలిపారు. పత్రాల సమర్పణ కోసం ఓటర్లకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసిపోయింది. అయినా పదిహేను లక్షల మంది ఓటర్లు వాటిని సమర్పించలేకపోయారు. పత్రాలను సకాలంలో అందజేయలేదన్న సాకుతో వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు.
రాత్రికి రాత్రే లక్ష ఓట్లు తొలగింపు
అయితే తాజాగా విడుదల చేసిన గణాంకాలు గందరగోళానికి తావిస్తున్నాయి. గుర్తించలేని ఓటర్ల సంఖ్య కేవలం ఒక్క రోజులోనే 11,484 నుంచి లక్షకు పెరగడం అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. డేటా సేకరణ, వర్గీకరణ పద్ధతులు, వాటిలో స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలగింపు కోసం గుర్తించిన ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ నెల 22 నాటికి తొలగింపు కోసం గుర్తించిన ఓటర్ల సంఖ్య 52 లక్షలుగా ప్రకటించారు. కానీ 23వ తేదీ నాటికి ఆ సంఖ్య 56 లక్షలకు పెరిగింది. అంటే ఒక్క రోజులోనే మూడు లక్షల ఓట్లను తొలగింపు కోసం గుర్తించారన్న మాట. ఈ గణాంకాలు మెజారిటీ బీహార్‌లో మెజారిటీ ఓటర్ల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నాయని స్పష్టమవుతోంది.
ఆది నుంచి వివాదాలే..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంఘాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి ఓటు హక్కును తొలగించడాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా పేర్కొంటున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రత్యేక సవరణ దేనికి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్లుగా నిరూపించుకోవడానికి ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులు తప్పనిసరి కాదని ఈసీ చెబుతున్నప్పటికీ, గుర్తింపు ధృవీకరణ కోసం వాటి పరిమిత వినియోగం పేదలు, వలస కార్మికులోకల ఆందోళనను పెంచుతున్నది. ఈసీ నిర్దేశించిన పత్రాలు వారికి అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.
ఈసీ చెప్పిన లెక్కలివీ..
ఓటర్ల జాబితా సవరణను ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నెల 14న ప్రారంభించింది. బీహార్‌లోని మొత్తం 7,89,69,844 మంది ఓటర్లలో 6,60,67,208 మంది ఓటర్ల నుంచి (83.66 శాతం) విజయవంతంగా పత్రాలను సేకరించామని ఈసీ తెలిపింది. రాష్ట్రంలో 1.59 శాతం మంది ఓటర్లు మరణించారనీ, 2.2 శాతం మంది నివాసాన్ని మార్చారనీ, 0.73 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని వివరించింది. ఈ డేటాను బట్టి చూస్తే 88.18 శాతం ఓటర్లను ధృవీకరించడం లేదా తొలగింపు కోసం వర్గీకరించడం పూర్తయిందని అర్థమవుతోంది.
బీహార్‌లో ఈసీ ఎన్నికల సిత్రాలు
- Advertisement -
- Advertisement -