Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం

పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం

- Advertisement -

– 2024-25లో నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి
– కాంపోజిట్‌, స్టీల్‌ స్ట్రక్చర్స్‌ నిర్మాణాలకు ప్రోత్సాహం
– యువ సివిల్‌ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కార్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం చూపుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని యువ సివిల్‌ ఇంజనీర్లను కోరారు. మూడున్నరేండ్లలో 5 లక్షల ఇంది రమ్మ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలన్నదే తమ ప్రభు త్వ లక్ష్యమన్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ (హైదరాబాద్‌) సెంటర్‌ ఆధ్వర్యంలో రాయదుర్గం లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో ‘నెక్స్ట్‌ – జెన్‌ హైరైస్‌ బిల్డింగ్స్‌ (అడ్వాన్స్‌మెంట్స్‌ ఇన్‌ కాంపోజిట్‌)’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిందని, రాష్ట్ర సేవల స్థూల విలువ జోడింపులో ఇది 24.9 శాతమని తెలిపారు. ఈ గణాంకాలు తెలంగాణ నిర్మాణ రంగ ప్రగతికి నిదర్శనమని అన్నారు. ఇటీవల దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైరైస్‌ భవన నిర్మాణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మరో 250 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలోనే మనం పర్యావరణహితంగా అడుగులు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ తరహా భారీ భవనాల నిర్మాణంలో రీన్‌ఫోర్స్డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌(ఆర్‌సీసీ) నిర్మాణాలకు బదులుగా కాంపోజిట్‌, స్టీల్‌ స్ట్రక్చర్స్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కంపోజిట్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ వినియోగం వల్ల భవనం పూర్తయ్యేందుకు పట్టే సమయం 40 శాతం, భారం 30 శాతం తగ్గుతుందన్నారు. భూకంపాలను సమర్థవంతంగా తట్టుకుంటాయని తెలిపారు. తెలంగాణలో ఆవిష్కరణలు కేవలం మాటలకే పరిమితం కావడం లేదని, ఆచరణలోనూ చూపిస్తున్నామని అన్నారు. స్మార్ట్‌ నగరాలు, స్థిరమైన గృహనిర్మాణం, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ ప్రతినిధులు ఎస్‌జీఎస్‌ మూర్తి, మహేందర్‌ రెడ్డి, శేషాద్రి, కాశీరాం, నర్మద, రమేష్‌, భీం రావు తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిన్నరలో రూ.50వేల కోట్ల పెట్టుబడులు
లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో గడిచిన ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, కొత్తగా 60 వేల మందికి ఉపాధి లభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. 2024- 25లో రూ.66 వేల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేసినట్టు వెల్లడించారు. 2024-25లో రూ.66వేల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేసినట్టు వెల్లడించారు. గ్రామీణ, సెమీ- అర్బన్‌ ప్రాంతాల్లో 5 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించాలని సంకల్పంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు చెప్పారు. అందరి అభిప్రాయాలను సేకరించి వికారాబాద్‌, నల్లగొండ, మెదక్‌లో ఫార్మా విలేజెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక్కడ జీవశాస్త్ర దిగ్గజాల భాగస్వామ్యంతో స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ’ రూపకల్పన చివరి దశలో ఉందన్నారు. మూడు జిల్లాల్లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను ముందే గుర్తించేందుకు చేపట్టిన ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌ సత్ఫలితాలిచ్చిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులు, వైద్య కళాశాలలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -