Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంఆర్థిక అసమానతలు తీవ్రతరం

ఆర్థిక అసమానతలు తీవ్రతరం

- Advertisement -

పాతికేండ్లలో 2,655 రెట్లు పెరిగిన కుబేరుల సంపద
నయా ఉదార విధానాలే ప్రధాన కారణం
ఉపాధి కల్పనకు, ప్రభుత్వ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న నిపుణులు

న్యూఢిల్లీ/జోహన్స్‌బర్గ్‌ : మన దేశంలోని 40 శాతం సంపద జనాభాలో ఒక్క శాతంగా వున్న కుబేరుల దగ్గర పోగైంది. గత 25 (2000-2024 మధ్య) సంవత్సరాల్లో సృష్టించిన దేశ సంపదలో 62 శాతం సంపదను వీరు స్వాధీనం చేసుకున్నారని జి 20 తాజా నివేదిక తెలిపింది. ఈ నెల 22, 23 తేదీలలో దక్షిణాఫ్రికా రాజధాని జోహన్స్‌బర్గ్‌లో నిర్వహించనున్న జి 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ సమావేశాలకు హాజరుకానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో అట్టడుగున్న వున్న 50 శాతం జనాభా సంపదతో పోలిస్తే ఒక్క శాతంగా వున్న కుబేరుల సంపద 2,655 రెట్లు పెరిగిందని ఈ నివేదిక ప్రకటించింది. దేశంలో 25 సంవత్సరాల క్రితం తొమ్మిది మంది బిలీయనీర్లుండగా ప్రస్తుతం 350కి పెరిగారు. ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని ఈ నివేదిక రూపొందించిన నిపుణులు ప్రకటించారు.

అర్థశాస్త్ర నోబెల్‌ బహుమతి గ్రహిత ప్రొఫెసర్‌ జోసెఫ్‌ ఇ. స్టిగ్లిట్జ్‌, డాక్టర్‌ అడ్రియానా అబ్దేనూర్‌ (బ్రెజిల్‌), విన్నీ బ్యానిమా (ఉగాండా), ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ (భారత్‌), ప్రొఫెసర్‌ ఇమ్రాన్‌ వలోడియా, మరియు డాక్టర్‌ వాంగా జెంబే-మ్కాబిలే (దక్షిణాఫ్రికా) బృందం పెరుగుతున్న ఆర్థిక అసమాతనలను, వాటికి మూలమైన కారణాలను విశ్లేషించింది.తీవ్రతరమవుతున్న ఆర్థిక అసమానతలు.. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయని వీటని నివారించడం నేడు ప్రపంచం ముందు వున్న అతిపెద్ద సమస్య అని స్టిగ్లిట్జ్‌ స్పష్టం చేశారు. ప్రపంచంలో 90 శాతం జనాభా నివసిస్తున్న 83 దేశాల్లో ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయికి చేరాయి. గత ఇరవై సంవత్సరాల్లో అనేక దేశాల్లో ప్రైవేట్‌ సంపద భారీగా పెరుగుతుంటే, సంపన్న దేశాలతో సహా ఆనేక దేశాల ప్రభుత్వాలు మాత్రం అప్పుల ఊబిలో కూరుకపోతున్నాయని ఈ నివేదిక తెలిపింది.

1980 నాటి ధరల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంపద 48 ట్రిలియన్‌ డాలర్లు వుంటే 2024 నాటికి 50 ట్రిలయన్‌ డాలర్లకు మాత్రమే పెరిగిందని, ఇదే కాలంలో ప్రైవేట్‌ సంపద 80 ట్రిలియన్‌ల నుండి 500 ట్రిలియన్లకు పెరిగిందని ఈ నివేదిక గణాంకాలతో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న తలసరి ఆదాయ లెక్కలు వాస్తవాన్ని తిరకాసు చేసి చూపుతున్నాయి. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న మన దేశం ప్రపంచ మానవాభివృద్దిలో 193 దేశాల్లో 130వ దేశంగా, ఆకలి సూచిలో 131వ దేశంగా అట్టడుగున వుంది. అసమానతల తీవ్రతరానికి ప్రధాన కారణం నయా ఉదారవాద ఆర్థిక విధానాలేనని ఈ నివేదిక తేల్చింది. ఈ విధానాల వల్ల 2000- 2024 మధ్య ధనవంతుల ఆదాయం సగటున 1,91,000 డాలర్లు పెరిగింది. ఇదే సమయంలో పేదల ఆదాయం మాత్రం గణనీయంగా తగ్గింది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ప్రజల జీవన విధానం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో వుంది. చాలా దేశాలలో యువత జీవిత అవకాశాలు తల్లితండ్రుల ఆదాయం మీద ఆధారపడి వున్నాయని, అందువల్ల వారు సరైన విద్య, ఉపాధి, వైద్యం, సామాజిక సౌకర్యాలను పొందడంలేదని ఈ నివేదిక తెలిపింది. చౌకగా శ్రామికుల శ్రమను దోచుకోవడం, కార్మిక చట్టాలను సవరించడం, పనిగంటలు పెంచడం, గతంలో వున్న చట్టబద్ధ హక్కులను, రిటైర్మెంట్‌ సదుపాయాలను రద్దు చేయడంలాంటి విధానాలు అనేక దేశాల్లో అమలవుతున్నాయి. జాతీయ ఆదాయంలో పెట్టుబడి, శ్రామిక వాటా నిష్పత్తిలో తీవ్రమైన వ్యత్యాసం వచ్చిందని, 1980లో 75 శాతం వున్న శ్రామిక వాటా 2024 నాటికి 29 శాతానికి పడిపోయిందని తేల్చారు. దీంతో అత్యధిక ప్రజల ఆదాయం తగ్గిపోయి వారు కొనుగోలు శక్తిని తగ్గించింది. ఈ స్థితికి కారణమైన గుత్తాధిపత్య కార్పొరేట్‌ కంపెనీలు మాత్రం తయారీ రంగం నుండి తప్పుకుని సేవారంగం, రియల్‌ ఎస్టేట్‌, హౌటల్‌, రిటైల్‌ లాంటి రంగాల్లోకి బదిలీ అయ్యారు.

కరోనా తర్వాత ఈ ధోరణి మరింత తీవ్రమైంది. 134 దేశాల్లోని 70,000 కంపెనీలు 1980 నాటికి మొత్తం అమ్మకాల్లో 15 శాతం వాటాను కలిగివుంటే, 2016 నాటికి 60శాతానికి పైగా ఆక్రమించేశాయి. ఈ పరిణామం ఆయా దేశాల్లోని చిన్న, మధ్యతరహా వ్యాపారుల ఉపాధిని దెబ్బతీసాయి.ఈ కంపెనీలు జాతీయ ప్రభుత్వాల మీద వివిధ రూపాల్లో ఒత్తిళ్లు తెచ్చి అనేక రాయితీలు పొందుతున్నాయి. సుంకాల చట్టాలను సరళీకరించడం, ప్రభుత్వసంస్థలను కారుచౌకగా కొనుగోలు చేయడం, సహజ వనరులను కొల్లగొట్టడం ఈ కాలంలో పెరిగింది. కొత్త సాంకేతికతలను ఉపయోగించుకుని నైపుణ్యం కలిగిన కార్మికుల బేరసారాల శక్తిని తగ్గించివేసి వారి వేతనాలను తగ్గించడం లేదా పెంచకపోవడం జరుగుతుంది. పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. ఎన్నికల్లో, ప్రభుత్వ ఏర్పాట్లలో సంపన్నుల బలం పెరుగుతుంది. ప్రజలకు అందాల్సిన సేవలను, సంక్షేమ పథకాలను కోతకోస్తూ, ధనవంతులు, కార్పొరేట్‌ కంపెనీలు అనేక రాయితీలను పొందుతున్నారని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -