మన్ననూర్-శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్
ఫ్యూచర్ సిటీ నుంచి బందర్‌పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే
ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మంచి రోడ్లతోనే ఆర్థిక ప్రగతి ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఆయన ఆర్ అండ్ బీ పద్దుపై మాట్లాడారు. రోడ్లు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థికవృద్ధి మెరుగుపడుతుందని అన్నారు. రోడ్ల అభివృద్ధితో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యామ్ మోడల్ కింద రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల రోడ్లను రూ.13,006 కోట్లతో రోడ్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను నెలరోజుల్లో పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్‌పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్ల పనులకు మే మొదటి వారంలో టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని అన్నారు.
రూ.7,600 కోట్లతో మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో మొదలుపెడతామని చెప్పారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచనప్రాయంగా అంగీకరించారని వివరించారు. డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నామని అన్నారు. వచ్చే మూడేండ్లలో హ్యాంతో కలిపి రూ.70 వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిం చిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.6 లక్షల మంది మరణించారని వివరించారు. రాష్ట్రంలో 22,441 ప్రమాదాల్లో 6,221 మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజుకు సగటున 18 నుంచి 20 మంది మరణిస్తున్నారని చెప్పారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు (చెన్నై, పూణే, బెంగుళూర్) వంటి నగరాలను కలుపుతూ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు. బుల్లెట్ ట్రైన్స్ కోసం సెంటర్ పాయింట్‌గా భారత్ ఫ్యూచర్ సిటీలో శంషాబాద్ దగ్గరలో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనున్నట్టు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు కొత్త భవనాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. రూ.ఎనిమిది వేల కోట్లతో హైదరాబాద్‌లో నాలుగు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందని వివరించారు. సనత్‌నగర్ టిమ్స్ జూన్ నాటికి పూర్తవుతుందని చెప్పారు.



