Sunday, September 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై మళ్లీ ఆర్థిక ఆంక్షలు

ఇరాన్‌పై మళ్లీ ఆర్థిక ఆంక్షలు

- Advertisement -

ఐరాస భద్రతా మండలి తీర్మానం

న్యూయార్క్‌ : ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్‌ చేపడుతున్న అణు కార్యక్రమం నేపథ్యంలో దానిపై ఆంక్షలు విధించాలని బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు అంతకుముందు భద్రతా మండలిని కోరాయి. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్‌ను నిరోధించేందుకు ఉద్దేశించిన 2015 నాటి సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై (జేసీపీఓఏ) ఈ మూడు యూరోపియన్‌ దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందం మేరకు ఇచ్చిన హామీని ఇరాన్‌ ఉల్లంఘించిందని ఆ దేశాలు ఆరోపించాయి. కాగా ఆంక్షలు తిరిగి విధించకుండా ఉండేందుకు యూరోపియన్‌ దేశాలకు సహేతుకమైన, సమతూకంతో కూడిన ప్రతిపాదన చేశానని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అంతకుముందు తెలిపారు.

భద్రతా మండలి తీర్మానంపై ఓటు వేసిన అనంతరం బ్రిటన్‌ రాయబారి బార్బరా ఉడ్‌వర్డ్‌ మాట్లాడుతూ తీర్మానానికి అనుగుణంగా చర్య తీసుకోవాలని ఇరాన్‌ను కోరుతున్నామని చెప్పారు. వచ్చే వారం జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇరాన్‌ అణు కార్యక్రమంపై దౌత్య యత్నాలు కొనసాగుతాయని చెప్పారు. ఆంక్షలు విధించాలన్న తీర్మానంపై ఓటింగ్‌ జరగడానికి ముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ ఇజ్రాయిల్‌ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నెలాఖరుకు ఇరాన్‌పై తిరిగి ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే పరిష్కారం దిశగా చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఐరాసలో ఫ్రాన్స్‌ రాయబారి అన్నారు. జేసీపీఓఏ కింద ఇచ్చిన అనేక హామీలను ఇరాన్‌ తుంగలో తొక్కిందని గత నెలలో మూడు యూరోపియన్‌ దేశాలు ఆరోపించాయి. ఒప్పందంలో అనుమతించిన దాని కంటే 40 రెట్లు అదనంగా యురేనియం నిల్వలను సమకూర్చుకుంటోందని విమర్శించాయి. ఇరాన్‌తో జరిగిన దౌత్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -