నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే.సినీ, క్రీడ రంగానికి చెందిన పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసి విచారించింది. ఈక్రమంలోనే తాజాగా క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ భారీ షాకిచ్చింది. ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ సైట్ వన్ ఎక్స్‌బెట్ (1xBet)కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్‌కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని, రూ.6.64 కోట్ల విలువైన రైనా మ్యూచువల్ ఫండ్స్‌ను జప్తు చేసేందుకు ఈడీ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా రంగంలోకి విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా పలువురు సినీ తారలు, మాజీ క్రికెటర్ల పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులు, క్రికెటర్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. 1xBet, దాని ప్రతినిధులను బెట్టింగ్‌ను ప్రోత్సహించేలా ఇద్దరు మాజీ క్రికెటర్లతో ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరితో పాటు ఇదే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో గతంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటీనటులు సోనుసూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రాతో పాటు పలువురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.



