– 337 పరుగుల తేడాతో భారత్ గెలుపు
– పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్ల విజృంభణ
– 1-1తో టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ సమం
58 ఏండ్లు. 8 టెస్టులు. 0 విజయాలు. ఇదీ ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ ఇండియా రికార్డు. గతంలో ఆస్ట్రేలియా కంచుకోట గబ్బాను బద్దలుకొట్టిన భారత్.. తాజాగా ఇంగ్లాండ్ కంచుకోట ఎడ్జ్‌బాస్టన్‌ను సైతం బద్దలుకొట్టింది. బ్యాటర్లు, బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెలరేగగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 337 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. రెండో టెస్టులో గెలుపుతో ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీని భారత్‌ను 1-1తో సమం చేసింది.
బుమ్రా లేడు. కుల్‌దీప్‌ను తీసుకోలేదు. రెండో టెస్టులో ఇక 20 వికెట్లు పడగొట్టినట్టే!. ఇదీ తుది జట్టును చూశాక విమర్శల మాట. పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లు వికెట్ల వేటను శాసించగా.. స్పిన్ ద్వయం జడేజా, సుందర్‌లు కీలక సమయంలో మాయ చేశారు. 608 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు కుప్పకూలింది. దీంతో బర్మింగ్‌హామ్‌లో భారత్ భలే విజయం అందుకుంది.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
బర్మింగ్‌హామ్‌లో బ్లాక్‌బస్టర్ విక్టరీ. యువ పేసర్ ఆకాశ్ దీప్ (6/99) ఆరు వికెట్లతో విజృంభించాడు. సిరాజ్, ప్రసిద్, జడేజా, సుందర్‌లు వికెట్ల వేటలో సమిష్టిగా మెరిశారు. 608 పరుగుల రికార్డు ఛేదనలో ఆతిథ్య ఇంగ్లాండ్ 68.1 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలింది. 337 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. జెమీ స్మిత్ (88, 99 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో భారత్ విజయాన్ని ఆలస్యం చేశాడు. ఒలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జెమీ స్మిత్ వికెట్లతో టీమ్ ఇండియా విజయానికి ఆకాశ్ దీప్ మార్గం సుగమం చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌ను 427/6తో డిక్లరేషన్ ఇచ్చింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో 250 ప్లస్, 150 ప్లస్ పరుగులు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన శుభ్‌మన్ గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి విజయం కావటం విశేషం. ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మూడో టెస్టు జులై 10 నుంచి లార్డ్స్‌లో జరుగనుంది.
ఆకాశ్ అదరగొట్టగాడు :
ఓవర్‌నైట్ స్కోరు 72/3తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ను భారత పేసర్ ఆకాశ్ దీప్ వణికించాడు. కొత్త బంతితో వికెట్ టు వికెట్ బంతులేసిన ఆకాశ్ దీప్.. ఇంగ్లాండ్ బ్యాటర్లను విలవిల్లాడించాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు ఒలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23)లను వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. 83/5తో ఇంగ్లాండ్ మరోసారి తొలి ఇన్నింగ్స్ తరహా కష్టాల్లో కూరుకుంది. కానీ, ఈసారి ఆ జట్టును ఆదుకునేందుకు ఎవరూ నిలబడలేదు. ఆకాశ్ దీప్‌కు సిరాజ్, జడేజా, ప్రసిద్, సుందర్‌లు సైతం జతకలిశారు. దీంతో ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామానికి ముందు ఆఖరు ఓవర్లో బెన్ స్టోక్స్ (33)ను సుందర్ మాయలో పడేయటంతో ఇంగ్లాండ్ ఓటమి లాంఛనమైంది. అప్పటికి ఆ జట్టు స్కోరు 40.3 ఓవర్లలో 153/6.
తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ బాదిన జెమీ స్మిత్ (88) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సహచర బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టినా స్మిత్ ఎదురుదాడి కొనసాగించాడు. ఏడు ఫోర్లతో 73 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన స్మిత్‌ను అవుట్ చేసిన ఆకాశ్ దీప్ కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. క్రిస్ వోక్స్ (7), జోశ్ టంగ్ (2) కథ ప్రసిద్, జడేజా ముగించగా.. బ్రైడన్ కార్స్ (38) వికెట్‌తో ఆకాశ్ దీప్ గెలుపు సంబరాలకు తెరతీశాడు. 68.1 ఓవర్లలో 271 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో ఓవరాల్‌గా అరుదైన పది వికెట్ల ప్రదర్శన చేశాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 587/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 407/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 427/6 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : బెన్ డకెట్ (బి) ఆకాశ్ 25, జాక్ క్రాలీ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 0, ఒలీ పోప్ (సి) ఆకాశ్ 24, జో రూట్ (బి) ఆకాశ్ 6, హ్యారీ బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్ 23, బెన్ స్టోక్స్ (ఎల్బీ) సుందర్ 33, జెమీ స్మిత్ (సి) సుందర్ (బి) ఆకాశ్ 88, క్రిస్ వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిద్ 7, బ్రైడన్ కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్ 38, జోశ్ టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2, బషీర్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (68.1 ఓవర్లలో ఆలౌట) 271.
బౌలింగ్ : ఆకాశ్ దీప్ 21.1-2-99-6, ప్రసిద్ కృష్ణ 12-3-57-1, ప్రసిద్ కృష్ణ 14-2-39-1, రవీంద్ర జడేజా 15-4-40-1, వాషింగ్టన్ సుందర్ 6-2-28-1.
1692
భారత్, ఇంగ్లాండ్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో నమోదైన పరుగులు 1692. ఈ రెండు జట్లు తలపడిన టెస్టులో పరుగుల పరంగా ఇదే అత్యధికం.
బర్మింగ్‌హామ్‌లో భలే విజయం!
2021లో గబ్బా. 2025లో ఎడ్జ్‌బాస్టన్. టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియా అసమాన విజయాలు ఇవి. గెలుపు ఆలోచనలే సాహసోపేతంగా అనిపించిన ప్రత్యర్థి కంచుకోటలో భారత్ విజయవంతంగా పాగా వేసింది. గబ్బాలో మెరిసిన పంత్, సిరాజ్, సుందర్‌లు ఎడ్జ్‌బాస్టన్ విజయంలోనూ కీలక పాత్ర పోషించటం గమనార్హం. లీడ్స్‌లో చేతికందని విజయాన్ని వదిలేసిన గిల్‌సేన.. బర్మింగ్‌హామ్‌లో భలే విజయం సాధించింది. తొలి టెస్టులో చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. బ్యాటర్లు లీడ్స్ జోరు కొనసాగించటంతో ఓ మ్యాచ్‌లో మనోళ్లు 1000 ప్లస్ పరుగులతో సత్తా చాటారు. లీడ్స్‌లో విఫలమైన బౌలర్లు.. ఇక్కడ గొప్పగా రాణించారు. కొత్త బంతితో ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగారు. సిరాజ్, ఆకాశ్ చెరో ఇన్నింగ్స్‌లో ఆరేసి వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శనతో అద్భుతం చేశాడు. తొలి టెస్టులో ఆఖరు ఐదు వికెట్ల భాగస్వామ్యాలు ఓటమికి దారితీయగా.. ఇక్కడ అది జరుగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 211/5తో కష్టాల్లో కూరుకోగా.. శుభ్‌మన్ గిల్ (269), రవీంద్ర జడేజా (89) ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించగా.. ఏడో వికెట్‌కు వాషింగ్టన్ సుందర్ (42), గిల్‌లు మరో 144 పరుగులు జతకలిపారు. ఇక్కడే మ్యాచ్ టీమ్ ఇండియా గుప్పిట్లోకి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ రాహుల్, పంత్, జడేజా అర్థ సెంచరీలకు తోడు గిల్ 161 శతకంతో మెరవటం కలిసొచ్చింది.
శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో పరుగుల వరద పారించినా.. నాయకుడిగా అతడి వ్యూహం విమర్శలకు గురైంది. 500 పరుగుల ఆధిక్యం దక్కినా.. రెండో ఇన్నింగ్స్‌లో డిక్లరేషన్ ప్రకటించలేదు. నాల్గో రోజు ఆఖరు సెషన్లో మూడు వికెట్లతో విమర్శల వేడి తగ్గినా.. ఐదో రోజు ఉదయం వర్షంతో మరోసారి గిల్ నాయకత్వ లక్షణాలు ప్రశ్నార్థకం. ఐదో రోజు పేసర్లు, స్పిన్నర్లకు ఎటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేసిన గిల్ వికెట్ల వేటకు ఊపందించాడు.కెప్టెన్‌గా రెండో అడుగులోనే బర్మింగ్‌హామ్ కోటను బద్దలుకొట్టిన గిల్ విజయంతోనే విమర్శలకు బదులిచ్చాడు.