అబ్బ, రామన్న ఇంటి ముందు అదో రచ్చ! సూర్యుడు నిదానంగా పైకి వస్తున్నాడు. వెంకటన్న కళ్ళల్లో ఆత్రుత స్పష్టంగా కనిపిస్తోంది. ”ఓ రామన్న, మీ పెద్దోడు ఉన్నాడనే ఇంత పొద్దుగాలనే వచ్చినా,” అంటూ గొంతులో అదో కంగారు.
రామన్న బయటకొచ్చాడు. ”ఆ.. రా..రా.. వెంకటన్న.. వాడు పాలు తేవడానికి పోయిండు, వస్తుంటాడు. కూసో. అయినా గానీ, వాడితో ఏం పనే?” అడిగాడు రామన్న.
”ఏం లేదు రామన్న, పోయినేడాది నరసన్నకు ఓ ఐదువేలు అప్పిచ్చిన. వాడు ఇప్పుడు డబ్బులు ఇస్తా అంటున్నాడు. మీ వోడు కాస్త లెక్క చూస్తాడేమోనని” అన్నాడు వెంకటన్న.
అంతలో ఆ విషయం విన్న అభిషేక్, ‘ఇదేం పనిరా బాబు’ అన్నట్టు మెల్లగా నవ్వుకున్నాడు.
రామన్న ”ఆ..ఆ.. అదిగో మాటల్లోనే వచ్చాడు” అంటూ అరిచాడు. ”అరే అభిషేక్, ఈ పెదనాయన నీకోసం వచ్చాడు. ఆ కాగితం చూసి లెక్క చెప్పు”
వెంకటన్న ఏదో చెప్పబోతుండగా, ”అరే నేను ఇప్పుడే వస్తానే. నా దోస్తు వరుణ్ గాడికి జ్వరం వచ్చిందంట. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకుపో బిడ్డా అని వాళ్ళ అమ్మ చెప్పింది. నేను ఇప్పుడే వస్తా..” అంటూ వెళ్ళిపోయాడు.
వెంకటన్నకు ఇంకేదో పని గుర్తుకొచ్చినట్లు ”సరేలేవే. నేను సాయంకాలం వస్తా. బాయికాడ పని ఉంది” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
వెంటనే అభిషేక్ కళ్ళల్లో ఒక రకమైన కంగారు. ”పోయిండానే ఆ వెంకటయ్య పెదనాయన? నాకు తెలుగు చదవడం, రాయడం రాదే! నేను ఆ కాగితం ఏం చూస్తా? ఏం లెక్క చేస్తా? అందుకే ఆయన పోవాలని అట్లా చెప్పిన!” తన మనసులోని మాటను బయటపెట్టాడు.
అది విన్న రామన్నకు షాక్. ”ఏందిరా? నీకు తెలుగు చదవడం, రాయడం రాదా? నువ్వు బడిలో పదవ తరగతి చదువుతున్నావు కదరా! అరేరు బిడ్డా, అట్లాగైతే పది ఎలా పాస్ అవుతావురా? నువ్వు బాగా చదువుతున్నావనుకుంటున్నానురా. అట్లాగైతే బడి మానేసి నా తోటి బాయికాడికి రా. నీకు వ్యవసాయం నేర్పిస్తా. నేను ఇవాళే నీ బడికి వచ్చి పెద్ద సార్ తోటి మాట్లాడి బడి మాన్పిస్తారా!” అన్నాడు కోపంగా.
అభిషేక్ వెనక్కి తగ్గాడు. ”వద్దే నాయనా, ఆ పని చేయకే నాయనా! నువ్వు బడి మాన్పిస్తే, నా దోస్త్ గాండ్లు నేను రోజూ కలుసుకుంటామా?… లేదురా! ఏదో ఒకటి చేసి బతకాలే లేకపోతే బతుకు కష్టమైతదిరా! నాయనా, నువ్వు చెప్పినట్టే చదువుకుంటా.
ఆ వ్యవసాయం పని చేయడం నావల్ల కాదు. పోయిన ఆదివారం నాడు బాయికాడ మనం కలిసి చేసిన వరికల్లం పని చేసినప్పుడే అనుకున్నా, ఈ వ్యవసాయం పని కష్టమైందని. నీవల్లనే అయితది. నావల్ల కాదని. నేను ఈ వ్యవసాయం చేయను. మంచిగా చదువుకుంటా. నాకు మూడు నెలల సమయం ఇవ్వు. బాగా చదివి మా తరగతిలోనే మొదటి స్థానంలో వస్తా” అన్నాడు ధీమాగా.
కొడుకు పట్టుదలను చూసి రామన్న ముఖంలో ఒక ఆనందం. ”సరేరా, మూడు నెలలే సమయం. ఈ మూడు నెలల్లో నువ్వు చెప్పినట్టుగానే బాగా చదువు. తరగతిలో మొదటి స్థానంలో రావాలి. లేకపోతే… వ్యవసాయమే నీ భవిష్యత్తు.” అన్నాడు గంభీరంగా.
అభిషేక్ కళ్ళల్లో ఆనందం, తనపై తన తండ్రికి ఉన్న నమ్మకం చూసి ”తప్పకుండా నాన్న! ఇకనుండి కష్టపడి చదువుతా!” అన్నాడు. ఆ క్షణం నుండి అతని భవిష్యత్తుకు కొత్త మార్గం ఏర్పడింది.
డా.బి.రమేష్, ఘన్ పూర్ స్టేషన్