– ఉపాధ్యాయుల వేతనాలపై అలా మాట్లాడటం సరికాదు
– సిఫారసులపై తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి సమర్పించిన విద్యా విధాన పత్రం-2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫెడరేషన్ అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ సిఫారసుల్లో కొన్ని ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేసేవిగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులకు సంబంధించి కమిషన్ చేసిన సిఫారసులు చాలా వరకు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ఆ సిఫారసులు ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయనీ, ఇలాంటి సిఫారసుల విషయంలో విద్యా కమిషన్ చైర్మెన్ పునరాలోచించుకోవాలని వారు కోరారు. కమిషన్ సిఫారసులు ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచేవిగా, ఎక్కువ మంది ఈ వృత్తిలోకి వచ్చే విధంగా ఉండాలంటే ఎక్కువ వేతనాలు ఉండాలనే జాతీయ విద్యా కమిషన్ (కొఠారి కమిషన్) సూచనలకు భిన్నంగా సిఫారసు చేశారని విచారం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు సాధించుకున్న అరకొర సౌకర్యాలను కూడా కమిషన్ చాలా ఎక్కువ అనే దష్టితో వ్యాఖ్యానించడం సరి కాదని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ వేతనాలు అనేవి ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇచ్చేవి కావనీ, రాష్ట్రంలోని ఉద్యోగులందరికి వర్తించేలా పీఆర్సీ సిఫారసుల మేరకే ఇస్తారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని మరిచి వేతనాల తగ్గింపు, అప్రెంటిస్ విధా నాన్ని సిఫారసు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న వారి వేతనాలతో, సౌకర్యాలతో, పదోన్నతి అవకాశా లతో పోల్చి చూసినప్పుడు ఉపాధ్యాయుల వేతనాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక హోదా కోణంలో పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అనేక శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగిగా నియామకమై పదవీ విర మణ పొందేలోపు ఉన్నతాధికారిగా పదోన్నతులు పొంద గలిగే అవకాశముందనీ, ఉపాధ్యాయులు మాత్రం ఒకే హోదాతో పని చేస్తారని గుర్తుచేశారు. అందవల్ల వారికిచ్చే వేతనాన్ని ఆర్థికకోణంలో కొలవడం సరికాదని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ రద్దు, ప్రధానోపాధ్యాయుల 50శాతం పదోన్నతిపై, ఉపాధ్యాయు ల పదోన్నతులకు పని తీరును కొలమానంగా తీసుకోవాలనే సిఫారసు పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సిఫారసులను కార్పొరేట్ కల్చర్‌లో భాగంగా చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పాఠశాలల మౌలిక వసతుల విషయంలో, ముఖ్యంగా ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం, విద్యారంగానికి 18 శాతం బడ్జెట్ కేటాయింపు, శిశు కేంద్రీకృత విద్యా విధానం లాంటి సిఫారసులను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే కమిషన్ సిఫారసులతో విద్యారంగానికి ఒరిగేదేమి లేదనీ, వాటిని అమలు పరచడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కమిషన్ సిఫారసులను అమలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న 7.5 శాతం బడ్జెట్‌ను వచ్చే బడ్జెట్‌లో విద్యారంగానికి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం 15 శాతానికి తగ్గకుండా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
విద్యాకమిషన్ చైర్మెన్ వ్యాఖ్యలు విచారకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



