Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా కమిషన్‌ చైర్మెన్‌ వ్యాఖ్యలు విచారకరం

విద్యా కమిషన్‌ చైర్మెన్‌ వ్యాఖ్యలు విచారకరం

- Advertisement -

ఉపాధ్యాయ వేతనాలు ఎక్కువనే రీతిలో మాటలు సరికాదు
సిఫారసులపై తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి : టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణ విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి సమర్పించిన విద్యా విధాన పత్రం-2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) అధ్యక్షులు చావ రవి డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్‌ సిఫారసుల్లో కొన్ని ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేసేవిగా ఉన్నా.. ఉపాధ్యాయులకు సంబంధించి కమిషన్‌ చేసిన సిఫారసులు చాలా వరకు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.

ఆ సిఫారసులు ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఇలాంటి సిఫారసుల విషయంలో విద్యా కమిషన్‌ చైర్మెన్‌ పునరాలోచించాలని కోరారు. కమిషన్‌ సిఫారసులు ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని పెంచేవిగా, ఎక్కువ మంది ఈ వృత్తిలోకి వచ్చే విధంగా ఉండాలంటే ఎక్కువ వేతనాలు ఉండాలనే జాతీయ విద్యా కమిషన్‌ (కొఠారి కమిషన్‌) సూచనలకు భిన్నంగా సిఫారసు చేశారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు సాధించుకున్న అరకొర సౌకర్యాలను కూడా కమిషన్‌ చాలా ఎక్కువ అనే దృష్టితో వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల వేతనాలు ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇచ్చేవి కావని, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ వర్తించేలా పీఆర్సీ సిఫారసుల మేరకే ఇస్తారని గుర్తుచేశారు.

ఆ విషయాన్ని మరిచి వేతనాల తగ్గింపు, అప్రెంటిస్‌ విధానాన్ని సిఫారసు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న వారి వేతనాలు, సౌకర్యాలు, పదోన్నతి అవకాశాలతో పోల్చి చూసినప్పుడు ఉపాధ్యాయుల వేతనాన్ని ఆర్థికకోణంలో కాకుండా సామాజిక కోణంలోనూ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అనేక శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగిగా నియామకమై పదవీ విరమణ పొందేలోపు ఉన్నతాధికారిగా పదోన్నతులు పొందగలిగే అవకాశముందని, ఉపాధ్యాయులు మాత్రం ఒకే హోదాతో పని చేస్తారని గుర్తుచేశారు. అందుకే వారికిచ్చే వేతనాన్ని ఆర్థికకోణంలో కొలవడం సరికాదని తెలిపారు.

పనితీరు కొలమానంపై అభ్యంతరం
ఉపాధ్యాయుల పదోన్నతులకు పనితీరును కొలమానంగా తీసుకోవాలనే సిఫారసుల పట్ల చావ రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సిఫారసులను కార్పొరేట్‌ సంస్కృతిలో భాగంగా చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పాఠశాలల మౌలిక వసతులు, ముఖ్యంగా ఇంటర్‌ వరకు మధ్యాహ్న భోజనం, విద్యారంగానికి 18 శాతం బడ్జెట్‌ కేటాయింపు, శిశు కేంద్రీకృత విద్యా విధానం లాంటి సిఫారసులను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే కమిషన్‌ సిఫారసులతో విద్యారంగానికి ఒరిగేదేమీలేదని, వాటిని అమలు పరచడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న 7.5 శాతం బడ్జెట్‌ను 15శాతం తగ్గకుండా పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ రంజాన్‌, పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, కోశాధికారి వల్లంకొండ రాంబాబు, జిల్లా కార్యదర్శులు షేక్‌ ఉద్దండ్‌ షరీఫ్‌, గుగులోతు రామకష్ణ, సురేష్‌, రాందాస్‌, చిన్నరంగారావు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -