నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలోని చిట్టబోయినపల్లిలో త్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా రూ.1284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో సీఎం ముఖాముఖి నిర్వహించి విద్యార్థులతో ముచ్చటించారు.తమ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యత అని అన్నారు సీఎం. విద్య ఒక్కటే మన జీవితాలను మార్చుతుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి సీఎం పాలమూరు బిడ్డేనని.. మళ్లీ 75 ఏళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు సీఎం రేవంత్.
అంతకుముందు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద ఉన్న బాలికల సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు సీఎం.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామశివారులో ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ కోసం కేటాయించిన స్థలం వద్దకు చేరుకొని భూమిపూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలపై వారితో చర్చించారు. ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.



