Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచదువే సమాజంలో మార్పునకు నాంది

చదువే సమాజంలో మార్పునకు నాంది

- Advertisement -

– విద్య ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధి : మంత్రి దామోదర రాజనర్సింహ
– నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

”చదువే సమాజంలో మార్పునకు నాంది పలుకుతుంది.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది” అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎండబెట్ల వద్ద హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. విద్యా రంగం ద్వారా భవిష్యత్‌ తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడంతోపాటు పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల విస్తరణ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాల నిర్మాణం చేశామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్‌ కేంద్రాలు స్థాపించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామని, అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అంతకుముందు విద్యార్థులతో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖాముఖిగా మాట్లాడారు. జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు, ఎలాంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారన్న అంశాలపై విద్యార్థులను ప్రశ్నిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం విధానాలు అమలు చేస్తోందన్నారు. వంగూరు మండలంలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బాధావత్‌ సంతోష్‌, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -