మార్కులు.. ర్యాంకులు.. సీట్లు.. ఉద్యోగాల చట్రాన్ని వదలాలి
సమాజ మార్పులో కవులు, కళాకారుల పాత్ర పెరగాలి
సోషల్‌మీడియా వేదికగా సాహిత్యాన్ని చర్చకు పెట్టండి : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్ సాహిత్యం : గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రియాజ్
సాహిత్యం గాలి సోకకే పిల్లలు ఆగం
ప్రతి పాఠశాల్లోనూ లైబ్రరీ పీరియడ్ పెట్టండి : కవి నెల్లుట్ల రమాదేవి
రవీంద్రభారతిలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ 111వ జయంతోత్సవం
కాళోజీ అవార్డును మంత్రి చేతుల మీద అందుకున్న నెల్లుట్ల రమాదేవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్కులు, ర్యాంకులు, సీట్లు, ఉద్యోగాలు అనే చట్రం నుంచి బయట పడాలనీ, మనిషిని సంస్కరించేలా విద్య ఉండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం, ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు 111వ జయంతి ఉత్సవాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా కాళోజి అవార్డును ప్రముఖ కవి నెల్లుట్ల రమాదేవి కి మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రంథాలయ, భాషోద్యమంలో కాళోజీ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి తన అక్షర ఆయుధాలను సంధించిన వైతాళికుడు అని చెప్పారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయనది అందెవేసిన చేయి అన్నారు. ‘సమాజం గొడవే నా గొడవ’ అంటూ నిజాం పాలకులను కాళోజీ ప్రశ్నించి రెండు సార్లు జైలుజీవితాన్ని గడిపారని గుర్తుచేశారు. డిజిటల్, సోషల్ మీడియా, సినిమాలోకంలోకి ప్రజలు కూరుకుపోవడం, వాటి ద్వారా జీవన విధానం విధ్వంసమై పిల్లల్లో రోజురోజుకీ నేరప్రవృత్తి పెరిగిపోతుండటం పట్ల మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ ఉన్న ఒక్క జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని సూచించారు. సమాజ పరివర్తన కోసం కవులు, రచయితలు విరివిగా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపుని చ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీనిచ్చారు.
కవులు, రచయితలు తమ సాహి త్యాన్ని నాలుగుగోడలకే పరిమితం కాకుండా సోషల్‌మీడియా ప్లాట్‌ఫారం పైనా విస్తృతంగా అందుబాటులో ఉంచాలనీ, చర్చకు పెట్టాలని విన్నవిం చారు. గ్రంథాలయాలకు కాళోజి సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అందజేస్తామని హామీనిచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రియాజ్ మాట్లాడుతూ..సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్ సాహిత్యమని నొక్కి చెప్పారు. అయితే, పుస్తకాలు రాస్తూ పోవడమే కాదు..వాటిని ప్రజలతో చదివించడం, చర్చలో పెట్టడం వంటివి చేయించే బాధ్యత కవులపై ఉందన్నారు. తొలిసారి మహిళా రచయిత నెల్లుట్ల రమాదేవికి కాళోజి పురస్కారం దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కవి, రచయిత, కార్టూనిస్టు, అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి మాట్లా డుతూ.. సాహిత్యం గాలి సోకకనే పిల్లలు ఆగమైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలోనూ లైబ్రరీ ఉండేలా, లైబ్రరీ పీరియడ్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పాఠశాలల్లో ప్రతివారం పిల్లలకు ఒక పుస్తకం ఇచ్చి చదివించాలనీ, ఆ పుస్తకంపై చర్చపెట్టాలనీ, పిల్లలకు కలిగిన అనుభూతిపై రాయించాలని సూచించారు. అప్పుడే పుస్తక పఠనం పెరుగుతుందనీ, పిల్లల ప్రవర్తన మంచి మార్గం వైపు మరలుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళోజిని మార్గదర్శిగా, ఆదర్శంగా తీసుకుని గ్రంథా లయాలను మరింత విస్తరించాలని ప్రభుత్వానికి విన్నవించారు. కార్య క్రమంలో దక్షిణామూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక కార్యదర్శి ఎన్.బాలాచారి, కాళోజి ఫౌండేషన్ చైర్మెన్ వీఆర్.విద్యార్థి, పౌండేషన్ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.