Saturday, October 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆరెస్సెస్‌ స్వాధీనంలో విద్యావ్యవస్థ

ఆరెస్సెస్‌ స్వాధీనంలో విద్యావ్యవస్థ

- Advertisement -

2014లో నరేంద్ర మోడీప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే, నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మతీఇరానీ, ఆరెస్సెస్‌ అనుబంధ సంఘాల నాయకులతో రహస్య సమావేశాలు జరుపుతున్నారనే వార్తలు వినిపించాయి. మోడీ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో, ఆరు సమావేశాలు జరిగాయని, 2014 నవంబర్‌ 23న ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో ప్రచురితమైన కథనం తెలిపింది. ఆరెస్సెస్‌ అత్యున్నత స్థాయి నాయకుడు సురేష్‌ సోనీ, ”ఎన్డీయే మొదటి ప్రభుత్వం (వాజ్‌పాయ్ ప్రభుత్వంలో 1999-2004)లో మేము తక్కువ పనిచేశాం, కానీ ఎక్కువ ప్రచారం చేసుకున్నాం. ఈసారి ఎక్కువ పనిచెయ్యాలి, ప్రచారానికి దూరంగా ఉండాలని” అన్నాడని, ఈ సమావేశంలో పాల్గొన్న (పేరు తెలియదు) వ్యక్తి చెప్పాడని ఆ కథనం వెల్లడించింది.

అసలు ఈ సంస్థలెక్కడివి? అవి విద్యాశాఖ మంత్రితో ఎందుకు సమావేశమయ్యాయి? విద్యా విధానంపై ఆరెస్సెస్‌కున్న ఆసక్తి ఏమిటి? అది ఎందుకు? ఈ ప్రశ్నల్లో కొన్నింటికి, గడిచిన పదకొండేండ్ల బీజేపీ పాలన స్పష్టంగా సమాధానాలిచ్చింది. నాటి నుంచి అనేక మంది విద్యాశాఖ మంత్రులు వచ్చారు, పోయారు. అనేక మలుపుల అనంతరం ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) ప్రవేశపెట్టారు. ఇది, హిందూత్వపై ఆధారపడిన ఆరెస్సెస్‌ సిద్ధాంత అధికారిక సమ్మతిని కలిగి ఉంది. అయితే, దానికి ప్రాచీన నాగరికత విలువలు, సాంస్కతిక ఐక్యత, దేశభక్తి, నైతిక మూలాల వంటి గొప్ప మాటలతో ముసుగు తొడిగారు. ప్రజలకు విద్యనందించడం అనేది ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన బాధ్యతగా పరిగణించబడే ఈ కర్తవ్యాన్ని, నిజాయితీ లేని ప్రయివేటు వ్యాపారులకు అప్పగిస్తూ, కార్పోరేట్‌ రంగంతో అపవిత్రంగా చేతులు కలిపిన తీరు ఈ విధానంలో ఉంది. దేశ వ్యాప్తంగా అనుమానం ఉన్నప్పటికీ, పెద్దగా తెలియని విషయమేమంటే, ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఉన్న విద్య, పరిశోధనా సంస్థల్లో, ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంఘాల సభ్యుల్ని నియమించడం ద్వారా వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నారు.

పాఠశాల ఉపాధ్యాయుల నుండి వైస్‌-ఛాన్సలర్ల వరకు, విద్య, పరిశోధనా సంస్థల డైరెక్టర్ల నుండి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల అధిపతుల వరకు, విద్యాసంస్థలపై బహిరంగ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఈ నియామకాలు అధ్యయన, పరిశోధన దిశలను మార్చివేస్తాయి. సానుకూలతను, బంధుప్రీతిని పెంచుతాయి. ఫలితంగా విద్యావ్యవస్థ మొత్తం కలుషితమవుతుంది.
ఎన్సీఈఆర్టీ లేక సీబీఎస్‌ఈ లాంటి సంస్థలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బోర్డులు పాఠ్యాంశాల్ని సవరించే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది విద్యావ్యవస్థను హస్తగతం చేసుకునే మరో అంశం. చరిత్రను మార్చడమే ప్రధాన లక్ష్యంలో భాగంగా మొఘలుల యుగం, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి పాఠశాల, ఉన్నత విద్యలోని పాఠ్యాంశాల్ని తొలగించి, మార్పులు చేసి, ఆ మార్పులు ఆరెస్సెస్‌కు ఉన్న ముస్లిం వ్యతిరేక వైఖరికి అనుగుణంగా ఉండేట్లు చేశారు. దానితో పాటు, వాస్తవానికి చారిత్రకంగా తక్కువ పాత్రను పోషించినప్పటికీ, ఆరెస్సెస్‌, హిందూత్వ ప్రముఖుల్ని చరిత్రలో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చివరగా, విద్యావ్యవస్థపై ఆరెస్సెస్‌ ఆధిపత్యం సాధించిన అంశాల్లో ఒక అంశంపై తక్కువ దృష్టి పెట్టారు. అది: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరెస్సెస్‌ ప్రేరణతో నడుస్తున్న సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అనేక రూపాల్లో అందిస్తున్నాయి. వర్క్‌షాప్‌లు, సెమినార్ల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించడం, ఆరెస్సెస్‌ ప్రభావిత సంస్థలు ప్రచురించే పుస్తకాల్ని సిలబస్‌ పాఠ్యాంశాలుగా నిర్దేశించడం లాంటివి జరుగుతున్నాయి. దీని వలన రెండు లాభాలు ఉన్నాయి: ఒకటి, ఇది ఆరెస్సెస్‌ అనుబంధ సంఘాలకు డబ్బును సమకూర్చుతుంది. రెండవది, వారి విషపూరిత సిద్ధాంత వ్యాప్తికి సహకరిస్తుంది.
”ఆరెస్సెస్‌ ప్రేరణతో నడిచే సంస్థలు” అని స్వయంగా ఆరెస్సెస్సే పిలుస్తున్న అనేక సంస్థలు ఈ కార్యకలాపాల రూపకల్పనలో, వాటి అమలులో పాల్గొంటున్నాయి. వీటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

ఆరెస్సెస్‌ ప్రేరణ పొందిన సంస్థలు
ఆరెస్సెస్‌, 32 సంస్థల్ని అధికారికంగా గుర్తించింది. ఈ సంస్థల ప్రతినిధులు, ఆరెస్సెస్‌ అఖిల భారత ప్రతినిధి సభ (అఖిల భారత కమిటీ)లో సభ్యులుగా ఉంటారు. ప్రతీ సంవత్సరం ఈ 32 సంస్థల అగ్రనేతలు, ఆరెస్సెస్‌ నిర్వహించే ”సమన్వయ్ బైఠక్‌” (సమన్వయ సమావేశం)లో పాల్గొంటారు. ఈ సమావేశం ఆరెస్సెస్‌ అగ్రనేతల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వీరిలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ (సర్సంగ్‌ చాలక్‌), కార్యనిర్వాహక ఉప నాయకుడు దత్తాత్రేయ హొసబలే, ఇతరులు ఉంటారు. ఈ సమావేశం ఈ సంవత్సరం సెప్టెంబర్‌ ప్రారంభంలో, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది.

గతేడాది కేరళలోని పాలక్కడ్‌లో నిర్వహించారు. బీజేపీ కూడా ఈ 32 సంస్థల్లో ఒకటి, కాబట్టి దాని అధ్యక్షుడు జే.పీ.నడ్డా ఈ సమావేశాల్లో పాల్గొన్నాడు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరెస్సెస్‌ ఈ సంస్థల్ని ఆరు గ్రూపులుగా (సమూహ్‌) విభజించింది. అవి: ఆర్థిక (ఎకనామిక్‌), సేవ(సర్వీస్‌), శిక్ష (ఎడ్యుకేషన్‌), సురక్ష( సెక్యూరిటీ), జన్‌ (ప్రజలు), విచార్‌ (ఆలోచన). ఈ గ్రూపులు సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధానపరమైన సూచనలు చేస్తాయి. అదే రీతిలో విద్యా సంబంధిత గ్రూపు కూడా మంత్రులు, అధికారులు, ఇతరులతో సమావేశాలు జరిపింది.

”విద్యా సంబంధిత గ్రూపు”
విద్యాసంబంధిత గ్రూపులో సభ్యులెవరు? మీడియా నివేదిక ప్రకారం, దీనిలో పదిలేక పదకొండు మంది సభ్యులుంటారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ): ఇది 1948లో స్థాపించబడిన ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ. ఇది ప్రాథమికంగా ఉన్నత విద్యాకేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో 24 మంది ఆరెస్సెస్‌ ప్రచారక్‌లు పనిచేస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరెస్సెస్‌ కోసం, ఈ సంఘం దాడులు చేసే దళంగా పనిచేయడం పెరిగింది. ఇది, విద్యార్థులు (జేఎన్‌యూలో వలె), అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లపై, యూనివర్సిటీ అధికారులపై హింసాత్మకం దాడులు చేస్తూ, ఆరెస్సెస్‌ను వ్యతిరేకించే వారి కార్యకలాపాలకు భంగం కలిగిస్తుంది. విద్యాభారతి: దీన్ని’అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌’ అని కూడా అంటారు. ఇది, 15వేల గుర్తింపు పొందిన పాఠశాలలతో పాటు గిరిజన ప్రాంతాల్లో నాలుగు వేల ఏకల్‌ శిక్షా కేంద్రాల్ని కూడా నిర్వహిస్తోంది.

అదే విధంగా పేద పట్టణ ప్రాంతాల్లో కూడా ఐదు వేల సంస్కార్‌ కేంద్రాల్ని నడుపుతూ, వారికి ”నైతిక,సాంస్కతిక” విద్యను బోధిస్తున్నారు. విద్యా భారతి ఆరువందల కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థల్ని కూడా నిర్వహిస్తుంది. ఈ సంస్థను అఖిల భారత స్థాయిలో 1977లో ప్రారంభించారు, దీనిలో యాభైకి పైగా ఆరెస్సెస్‌ ప్రచారక్‌లు పని చేస్తున్నారు. పాఠశాలల ద్వారా ఆరెస్సెస్‌ భావజాల వ్యాప్తికి ఇదొక సాధనంగా పనిచేస్తుంది. ”హిందూత్వకు అంకిత భావంతో, దేశభక్తి నిండిన యువతను తీర్చిదిద్దడానికి సహాయపడే జాతీయ విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడం” తన లక్ష్యమని విద్యాభారతి పేర్కొంటుంది. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ సంఘ్‌:ఇది 1988లో స్థాపించబడిన అధ్యాపకుల సంఘం. దీనిలో 35 రాష్ట్ర స్థాయి, 50 యూనివర్సిటీ స్థాయి సంఘాలు పనిచేస్తాయి. ”విద్యా, సామాజిక రంగాల్లో” సాంస్కతిక జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తి, దీని లక్ష్యం. అఖిల భారతీయ ఇతిహాస్‌ సంకలన్‌ యోజన:ఇది, భారతదేశ చరిత్రను తిరగరాయడానికి అంకితమైన సంస్థ.

1994లో స్థాపించబడిన ఈ సంస్థ, భారతదేశ ‘వాస్తవ’ చరిత్రను సేకరించి, ప్రస్తుత భారతదేశ చరిత్రలోని పరస్పర విరుద్ధమైన అంశాల్ని, తప్పిదాల్ని సరిచేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఉదా: ”ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం”, ”వేద సరస్వతీ నది”, ”తీర్థయాత్రా స్థలాల చరిత్ర”, ”పురాణాల చరిత్ర ” వంటి అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇది క్రమబద్ధంగా పుస్తకాల్ని ప్రచురించింది. కళాశాలలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న చరిత్ర అధ్యాపకులు, ఇతర మేధావులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. వీరికి తోడుగా, ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌’ సంబంధిత అంశాల్లో సహకరిస్తుంది. ఇంకా శిక్షా సంస్కతీ ఉత్థాన్‌ న్యాస్‌ , అఖిల భారతీయ సాహిత్య పరిషత్‌, విజ్ఞాన్‌ భారతి, సంస్కత భారతి, భారతీయ శిక్షణ్‌ మండల్‌, సంస్కార్‌ భారతి లాంటి సంస్థలు ఆరెస్సెస్‌ కింద పనిచేస్తున్నాయి.

విద్యా వ్యవస్థ ఆక్రమణ
ప్రజల, ముఖ్యంగా యువతలోని ఆలోచనల్ని మార్చే అత్యంత ముఖ్యమైన సాధనాల్లో విద్యావ్యవస్థ ఒకటని ఆరెస్సెస్‌ ప్రారంభం నుండే వాదిస్తూ వచ్చింది. గత వందేళ్లలో ఆరెస్సెస్‌, తన శాఖల ద్వారా, శిక్షణా శిబిరాల ద్వారా, అనుబంధ సంస్థల ద్వారా ఆ పనిచేసింది. అన్ని సంస్థలు, ఆరెస్సెస్‌ ముఖ్య సిద్ధాంతంతో బంధించబడి ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు, వాటిలో కొన్ని సంస్థలు ప్రధాన పాత్రధారులుగా కాక పరిమితంగా మాత్రమే పనిచేశాయి. మోడీ ప్రభుత్వం ఈ సంస్థలకు అనూహ్యంగా విస్తతావకాశాల్ని కల్పించింది. ప్రభుత్వ విధానంపై సలహాలు ఇవ్వడమే కాక, వివిధ రకాలుగా వారు విస్తత ప్రయోజనాలను పొందుతున్నారు.

అవి: వివిధ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ పదవుల్లో సభ్యులుగా నియమించబడటం వారు ప్రచురించిన పుస్తకాల్ని విద్యాసంస్థలు, గ్రంథాలయాలు మొదలైన వాటిలో అనుసరించేట్లు చేయడం; శిక్షణా కార్యక్రమాలు, కార్య శాలలు, సదస్సులు, సభలు, ప్రదర్శనలు మొదలైన వాటికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం పొందడం; వ్యతిరేక భావాన్ని నిలువరిం చడానికి ఎదుటి వారిపై దాడులు చేయడం, రక్షణ పొందడం; బీజేపీతో మరింత దగ్గరగా బలమైన సంస్థాగత సంబంధాల్ని ఏర్పాటు చేసు కోవడం. ఈ సంస్థలు ప్రభుత్వాల నుండి పొందుతున్న సహాయం, నిధులు అనేక రూపాల్లో ప్రజలకు తెలియకుండానే, పారదర్శకత లేకుండానే దాస్తున్నారు. బయటపడింది కేవలం మంచు పర్వతం యొక్క పైభాగం మాత్రమే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను ప్రస్తావించాల్సి ఉంది. విద్యావ్యవస్థ ఉమ్మడి జాబితాలో ఉంటుంది. పాఠశాల విద్య ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరెస్సెస్‌ సంస్థలతో గట్టి సంబంధాలు కలిగి ఉన్నాయి. రాష్ట్రస్థాయి విధాన ప్రకటనల్లో కూడా ఆరెస్సెస్‌ ఆలోచనల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

దీనికి ప్రతిగా, ఈ సంస్థలు కేవలం ఆరెస్సెస్‌ విషపూరిత సిద్ధాంతాన్నే కాక బీజేపీ ప్రభుత్వ కార్యకలాపాలు, వాటి నిర్ణయాల్ని కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ, ఆరెస్సెస్‌ అధినేత చేస్తున్న విధంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రశంసించే గాయక బందంలో చేరాయి. మొత్తంగా చెప్పాలంటే ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థలతో పాటు మోడీ ప్రభుత్వ కలయికతో చేసిన ప్రయత్నాల వల్ల, భారత విద్యా వ్యవస్థలో పెద్ద భాగాలు ఆరెస్సెస్‌ విధేయుల చేతుల్లోకి వెళ్ళాయి. ఇది, కొత్త ప్రభుత్వ విధానాలు, నిధుల కేటాయింపు, ప్రయివేటు పెట్టుబడి ఆమోదం, సిద్ధాంతపరమైన చొరబాట్ల ద్వారా సాధించబడింది. ఇది, ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి, శాస్త్రీయ భావాలకు, ఆధునిక ఆలోచనలకు ప్రమాదకరం. భవిష్యత్తులో బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికారం నుంచి తొలగించబడినప్పుడు, ఈ వ్యవస్థను శుద్ధిచేసే ప్రక్రియను ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలి.
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌,9848412451

  • సావేరా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -