మాజీ ఎమ్మెల్సీ, పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి
నల్లగొండలో కవి సమ్మేళనం
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
విద్యార్థులందరికీ అంతరాలు లేని విద్య అందించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘విద్యలో అంతరాలు (అసమానతలు) తొలగిపోయేదెట్టా?’ అనే అంశంపై ఆదివారం నల్లగొండ పట్టణంలోని యూటీఎఫ్ భవన్‌లో టీపీఎస్వీ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో సమూల మార్పు వచ్చేదాకా విద్యా రంగంలో ఈ అసమానతలు కొనసాగడం కన్నా.. అంతరాలు లేని విద్యాసమాజాన్ని నిర్మించుకోవాలన్నారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని కోరారు. వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసి ప్రజలను ఆలోచింపజేయాలనే ఉద్దేశంతో ఈ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు.
కవులు సమాజ నిర్దేశకులని, వారి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆరు దశాబ్దాల కింద కొఠారి కమిషన్ చెప్పిన కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెడితేనే విద్యారంగంలో అసమానతలు రూపుమాపబడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కవి సమ్మేళనాలు జరుపుతామని, హైదరాబాద్‌లో మొదటిది జరగ్గా.. రెండోది నల్లగొండలో నిర్వహించామని చెప్పారు. భవిష్యత్‌లో ఈ కవితా సంకలనాలను పుస్తకంగా తీసుకురానున్నట్టు తెలిపారు. వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్ మాట్లాడుతూ.. విద్యారంగంలో అసమానతలు ఉండటం వల్ల విలువలు పతనమవుతున్నాయన్నారు. విలువలను కాపాడుకుంటూనే సమాన విద్య కోసం కవులు, రచయితలు తమ రచనలతో సామాజిక చైతన్యం తీసుకురావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కవులు డా. సాగర్ల సత్తయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, డా. పగడాల నాగేందర్, మునాసు వెంకట్, పెరుమాళ్ళ ఆనంద్, భూతం ముత్యాలు, శ్యాంసుందర్, పగిడిపాటి నరసింహ, లింగమూర్తి, భీష్మాచారి, బండారు శంకర్, హుస్సేన్, గేర నరసింహ, యాదగిరి, కె.మంగ, ధనమూర్తి, వాణిశ్రీ, రాఫెల్, నలపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.