– ఫీజు నియంత్రణ చట్టం తేవాలి
– విద్యాశాఖకు మంత్రిని నియమించాలి
– ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
– వామపక్ష విద్యార్థి సంఘాల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 23న విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరాయి. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలని సూచించాయి. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలని డిమాండ్ చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అనిల్, జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఏఐడీఎస్‌వో నాయకులు నితీశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, అశోక్‌రెడ్డి, పీడీఎస్‌యూ నాయకులు హరీశ్, నవీన్, శ్రీను, ఆసిఫ్ తదితరులు విద్యాసంస్థల బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో, డిప్యూటీఈవో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను కల్పించాలనీ, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఉన్న బకాయిలను విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఎన్‌ఈపీ-2020ని రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
23న విద్యాసంస్థల బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES