– వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
– ప్రభుత్వ విద్యారంగంలో
సమస్యల పరిష్కారానికి డిమాండ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడిఎస్వో, ఏఐపీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్, ఇతర సంఘాల నాయకులు బుధవారం హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకుండా.. విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ముందు విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామన్న హామీని నెరవేర్చలేదని, 7 శాతమే ఇచ్చిందని తెలిపారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ, పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పెండింగ్ స్కాలర్‌షిప్ విడుదల చేయాలని, మౌలిక సదుపాయాలకు తగిన నిధులు ఇవ్వాలని, పెండింగ్ మెస్, కాస్మొటిక్స్ చార్జీలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ మాట్లాడుతూ.. గురుకులాల్లో సమయపాలనలో మార్పు చేయాలన్నారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కీమ్’ బకాయిలు విడుదల చేయాలని, ఎయిడెడ్ పాఠశాలల పెండింగ్ నిధులు ఇవ్వాలని, విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్‌లను మంజూరు చేయాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, ఎన్‌ఈపీ- 2020 అమలును తక్షణమే నిలిపి, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఇతర విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బంద్‌కు అన్ని విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నితీష్, ఏఐపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె మురళి, ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి హకిమ్ తదితరులు పాల్గొన్నారు.
23న విద్యాసంస్థలు బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES