Wednesday, April 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యా సంస్కరణలు-కొన్ని సూచనలు

విద్యా సంస్కరణలు-కొన్ని సూచనలు

- Advertisement -

జోడుగుర్రాల స్వారీ జేమ్స్‌ బాండ్‌ సినిమాలో తప్ప నిత్యజీవితంలో ఆ సర్కస్‌ ఫీట్‌ సాధ్యం కాదు! ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా విద్యారంగంలో సంస్కరణ కోసం ఒకవైపు ఆకునూరి మురళి కమిషన్‌ వేసి, మరోవైపు కె.కేశవరావు విద్యాకమిషన్‌ ప్రకటించి చేసే ప్రయాణం నిజంగా జోడుగుర్రాల స్వారీ లాంటిదే! ఈ రెండు గుర్రాలు కూడా దేనికదే ప్రత్యేకం, కాడి కలుపుకుపోయో రకం కానేకాదు. కమిషన్‌ నిర్ణయం మాత్రమే ఫైనల్‌ కాదు, ‘ఏవైనా సమస్యలు ఉంటే కేశవరావుకు చెప్పుకోండి’ అని ముఖ్యమంత్రినే ప్రకటించడం మాట ప్రజాస్వామికమే అయినా చేతల్లో వైవిద్యం కనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యా అభివృద్ధి అవుతుందని కేశవరావు నమ్ముతారు. ఆకునూరి మురళి ప్రభుత్వం ఆధ్వర్యంలోని పబ్లిక్‌స్కూల్స్‌ తప్ప మరోమార్గం లేదనేది ఆయన నమ్మకం. ఇరువురిది పరస్పర విరుద్దమైన ఆర్థిక ప్రణాళిక. సమన్వయం చేయగలిగితే పర్వాలేదు! వికటిస్తే విద్యావ్యవస్థనే అస్తవ్యస్తమవుతుంది. వ్యక్తిగత సర్దుబాట్ల కంటే వ్యవస్థాగత సర్దుబాటు ముఖ్యం. కొత్త విధానం ప్రవేశపెట్టినప్పుడు అపోహలకు, అపార్థాలకు అవకాశం లేకుండా ఎదురయ్యే సవాళ్లు పరిష్కారం చేయాల్సి ఉంటుంది.

మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అధ్యక్షతన వేసిన విద్యాకమిషన్‌ తెలంగాణా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థపై సుదీర్ఘ అధ్య యనం చేసి ఓ నివేదిక అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు ఉండాలి, కానీలేవు, అయినా ప్రభుత్వ బడిని సంస్కరిస్తామని ప్రభుత్వం అంటున్నది.నర్సరీ నుండి ఇంటర్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ ఏడాది ఓ వంద నియోజకవర్గాలు, రెండు వందల మండలాల్లో మండ లానికి రెండు ప్రభుత్వ పాఠశాలల చొప్పున నాలుగు వందల పాఠశాలలు పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఒక్కోపాఠశాలకు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్‌తో 1500 మంది పిల్లల నమోదుతో ”తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌” ఏర్పడతాయి. ఎవరేమి చెప్పినా ప్రభుత్వ బడులలో నమోదు శాతం పడిపోతు, మూతపడుతున్న దశలో తాజా సంస్కరణ అనివార్యం! ఈ ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో రాష్ట్రంలో 1920 ప్రభుత్వ బడుల మూతతో దేశంలో రెండవ స్థానంలో నిలబడ్డాం. ఇక విద్యాప్రమాణాలు దృష్ట్యా చూసినప్పుడు దేశంలో మనర్యాంకు 26వ స్థానంలో ఉంది. ఈ రెండు గణాంకాల సూచిక ప్రభుత్వ బడులు సంస్కరణ అనివార్యతకు సూచిక. కనుక విద్యాకమిషన్‌ సూచనలు నూటికి నూరుశాతం ఆమోదయోగ్యం.
ఇక సమస్యలు గుర్తించడానికి, నిర్వాహణకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక విద్యాబోర్డులను ఏర్పరచడం. సంస్కరణ పారదర్శకంగా అమలు జరగాలంటే, ఈ విద్యాబోర్డులలో విద్యారంగంలో నిపుణులు, మాజీ విద్యాశాఖ అధికారులను సైతం జిల్లా రాష్ట్ర స్థాయిలో భాగస్వా ములను చేయాలసి ఉంటుంది. ఒక్కో మండలంలో 30 ప్రాథమిక పాఠశాలలు, ఓ ఏడెనిమిది ఉన్నత పాఠశాలలు, ఐదారు ప్రాథమికోన్నత పాఠశాలలు స్థానంలో రెండే పాఠశాలల ఎంపిక, స్థాపన, నిర్వాహణ ఒక రకంగా చిక్కు సమస్యనే? పాఠశాల యాక్సెస్‌ అనబడే సరికొత్త సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి విద్యాకమిషన్‌ తొలుత సిఫార్సు చేసిన విధంగా మండలానికి మూడు తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌, నాలుగు తెలంగాణా ఫౌండేషన్‌ స్కూల్స్‌ ఏర్పరచి ఉంటే కొంతలో కొంతైనా మండలంలో యాక్సెస్‌ సర్దుబాటు కాస్తా సమస్య తేలికయ్యేది.ఇప్పుడు రెండే రెండు తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌ స్థాపన మూలంగా ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం అనేది తప్పనిసరి అవుతుంది.ఈ ఏడాది బడ్జెట్‌లో దానికి అవకాశం కల్పించలేదు. ఐదేండ్ల కాలపరిమితిలో రాష్ట్రంలో ఉన్న 26వేల వివిధ రకాల పాఠశాలల స్థానంలో సమగ్ర సౌకర్యాలతో కేవలం రెండువేల తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌ మాత్రమే ఉనికిలో ఉంటాయి. తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌ అనే అంశంలో భౌతికపరమైన అంశం ఎలావున్నా కొన్ని చట్టబద్దమైన, నిర్వాహణాపరమైన సంక్లిష్టతలు తొలగించుకోవాలసి ఉంటుంది.

అందులో మొదటిది మాతృభాషలో విద్యాబోధన. మనఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర విద్యాచట్టానికి లోబడి రాష్ట్ర చట్టం ఉండాలి. విద్యాహక్కుచట్టం 1 నుండి 5 తరగతులు మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి చేసినందువల్ల, విద్యా కమిషన్‌ ఈవిషయంలో సడలింపు ఇవ్వాలి. నర్సరీ నుండి 5వతరగతి వరకు ఆంగ్ల మాధ్యమంతోపాటు, మాతృభాష మాధ్యమం సైతం ఆప్షన్‌గానైనా అనుమతించే సవరణ తప్పనిసరి. ఎందుకంటే పిల్లలకు తమది కాని ఏ భాషనైనా ఆధిపత్య భాషనే అవుతుంది. మారుతున్న ప్రాపంచిక పరిస్థితులలో ఆంగ్లం ప్రాధాన్యతనే సుదీర్ఘకాలం ఉంటుందని భావించలేము. ఇక రెండవ అంశం, తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌నందు ఉత్తీర్ణత 35మార్కుల నుండి 45మార్కులకు పెంచడం. ఓ శతాబ్దకాలంగా మన విద్యా మేధావులు ఈ ఉత్తీర్ణత ప్రమాణమే అశాస్త్రీయ అంశమని తేల్చారు. అందుకే విద్యాహక్కు చట్టం-2009లో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిబిఐ)ని తెచ్చారు. దీని ప్రకారం విద్యార్థుల విద్యా సామర్థ్యాల కొలమానం గ్రేడులేకాని మార్కుల ప్రాతిపదిక కాదు. మరి ఈ కొలమానం పదవతరగతి,12వ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో ఎలా అమలు చేసేది చిక్కు సమస్యనే! విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రమాణాలు కొలమానమే కాని మార్కుల ప్రాతిపదిక ఉండదు. ఒకవేళ మనం అమలు చేసినా 35మార్కుల నుండి ఉత్తీర్ణత శాతం 45శాతంగా నిర్ణయం చేయడం సమంజసం కాదు. కనీసం మధ్యేమార్గంగా నలభై మార్కులకు కుదించడం లేదా అన్ని సబ్జెక్టులు సరాసరి నలభై చూసి ఉత్తీర్ణత ప్రమాణం నిర్ణయించడం కూడా చేయవచ్చును. ఇంజ నీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ విద్యకు ప్రవేశపరీక్ష లేనందున ఇంటర్‌ పరీక్షలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ ఇంటర్‌, పది పరీక్షలు మార్కుల ప్రాతిపదికన నిర్వహించినా సిసిఐ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుంది.

ఇక తెలంగాణాలో ఉన్న ప్రయివేటు విద్యా వ్యవస్థ కూడా ”తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌”విధానాలనే నూటికి నూరుశాతం అనుసరించేలా చూడాలి. ఇక మూడవ ప్రధాన అంశం, ఉపాధ్యాయ విద్యలో సంస్కరణ. ఉపాధ్యాయ విద్యలో నర్సరీ, ప్రాధమిక విద్య,ఉన్నత పాఠశాల విద్య మొత్తానికి రెండేరకాల శిక్షణ కోర్సులు సూచించింది.ప్రాధమిక ఉపాధ్యాయ శిక్షణ,సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ, రెంటికీ పీజీని కనీసం అర్హతగా కమిషన్‌ సూచించింది.కనుక టెట్‌, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ ప్రమోషన్‌, అదనపు అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు లాంటి ఆర్థిక సమస్యలు ఇక కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు ఉండే అవకాశం లేదు. ఇక నర్సరీ నుండి ఇంటర్‌ వరకు పాలు, రాగి జావ బ్రేక్‌ఫాస్ట్‌గా సూచించడం, ఇంటర్మీడియట్‌కు కూడా మధ్యాహ్న భోజనం విస్తరణ అనే అంశాలు తెలంగాణా పబ్లిక్‌ స్కూల్స్‌ అనబడే కాన్సెప్ట్‌ నుండి వచ్చిన సౌకర్యాలు. ఏ రకంగా చూసినా చిన్నచిన్న మార్పులతో ప్రభుత్వ బడులు సంస్కరణకు ఇంతకంటే మార్గం లేదు. నూతన సిపార్సు ప్రకారం 3-18 వయస్సు పిల్లలకు విద్యాహక్కు చట్టం వర్తింపజేయాల్సి ఉన్నందున నర్సరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల వ్యవస్థ, డిగ్రీ కళాశాలలు, టెక్నికల్‌ విద్యను యూనివర్సిటీలకు అనుసంధానం చేసి రెండే రెండు విద్యావ్యవస్థలుగా పునర్వ్య వస్థీకరణ చేయడం ప్రభుత్వం ముందున్న ఉత్తమమైన మార్గం. కనుక గత నలభై ఏళ్లుగా మార్పులు జీర్ణించుకోలేక కుదేలైన ప్రభుత్వ పాఠశాల, ఉన్నత విద్యావ్యవస్థకు తిరిగి ప్రాణప్రతిష్ట చేసిన ఖ్యాతి సంస్కరణ ద్వారా సర్కార్‌కు దక్కుతుంది.

ఎన్‌.తిర్మల్‌
9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -