Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంవిద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి

విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలి

- Advertisement -

బోధనా పద్ధతులను కాలానికనుగుణంగా టీచర్లు మార్చుకోవాలి : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
ఉపాధ్యాయ శిక్షణలో పాల్గొన్న 89,378 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు జిల్లాస్థాయి మొదటి విడత శిక్షణలో 17,771 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే రెండో విడతలో జిల్లా, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమంలో 89,378 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. మంగళవారం జూమ్‌ మీటింగ్‌ ద్వారా ఉపాధ్యాయులకు యోగితారాణా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలిగేలా ప్రతి ఉపాధ్యాయుడూ తమ బోధనా పద్ధతులను కాలానికనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేసి రాష్ట్రాన్ని విద్యా ప్రమాణాల పరంగా ముందువరుసలో నిలబెడతారనే నమ్మకం, విశ్వాసం ఉందని వివరించారు. చాలా మంది ఉపాధ్యాయులు ఉత్తమ పద్ధతుల ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచారని గుర్తు చేశారు. తద్వారా పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచారని అన్నారు. అందుకు రంగయ్య, రవిరాజు, భవాని వంటి ఉపాధ్యాయులే ఉదాహరణ అని చెప్పారు. వారి వివరాలను సేకరించి రాష్ట్రస్థాయిలో సమ్మేళనం నిర్వహించబోతున్నామని అన్నారు. వారి ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించబోతున్నామని వివరించారు. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి విద్యార్థులంతా చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో ఉపాధ్యాయులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న 1.22 లక్షల మంది ఉపాధ్యాయులకు ఒకేసారి ఐదురోజుల శిక్షణ కార్యక్రమాన్ని బోధనా సమయం వృధా కాకుండా వేసవి సెలవుల్లో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -