Sunday, February 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగద్దర్‌ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు కృషి

గద్దర్‌ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు కృషి

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతాం
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌
గద్దర్‌ లక్ష్యాలను సాకారం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రవీంద్రభారతిలో గద్దర్‌ 78వ జయంతి కార్యక్రమం

నవతెలంగాణ-కల్చరల్‌
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గద్దర్‌ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని, రాబోయే గద్దర్‌ జయంతి ఆ కేంద్రంలోనే జరిగేలా కృషి చేస్తానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ చెప్పారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికగా శనివారం భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్‌ 78వ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. తన జీవితాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం గద్దర్‌ చేపట్టిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్నారు. శాసనమండలి ఉప సభాపతి బండ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. కవులు, కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని, హామీ ఇచ్చిన మేరకు గద్దర్‌ సాహితీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే గద్దర్‌ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. గద్దర్‌ ఏ లక్ష్యాల కోసం పోరాటం చేశారో వాటిని సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన గద్దర్‌కు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ పోరాటాన్ని రాజ్యంపై తిరుగుబాటుకు ప్రతీకగా పేర్కొన్నారు. మంత్రి సీతక్కను సమ్మక్క-సారలమ్మ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తుంచుకోవాలన్నారు. ప్రొఫెసర్లు కోదండరామ్‌, హరగోపాల్‌ మాట్లాడుతూ పాటను ఆయుధంగా మలుచుకొని గద్దర్‌ వేలాది మందిని ప్రభావితం చేశారని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్దర్‌ పాటల సంపుటి ‘సిరిమల్లె’ను మంత్రి ఆవిష్కరించగా ప్రొఫెసర్‌ కాసీం సమీక్ష చేశారు. సభా కార్యక్రమాన్ని సూర్యకిరణ్‌, పృథ్వీ నిర్వహించారు. ప్రొఫెసర్‌ శాంతసిన్హా, సంజీవ, సోమన్న, జయరాజ్‌, అశోక్‌, జేబీ రాజు, మధుయాష్కీగౌడ్‌, విమల గద్దర్‌, డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -