విత్తనం చాలా ముఖ్యం.. రాష్ట్రాలకు కొన్ని హక్కులుండాలి
విత్తన రైతులకు నష్టాలు..కంపెనీలకు లాభాలు
రైతుకు ఇబ్బంది కాకుండా విత్తనంపై హక్కుండాలి : రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో సీడ్‌బిల్లు తీసుకొచ్చేందుకు కసరత్తు పూర్తిచేశామనీ, ఆ ఫైల్ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉందని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి తెలిపారు. విత్తనమనేది చాలా ముఖ్యమైన అంశమనీ, దానిపై రాష్ట్రాలకు కొన్ని హక్కులు కల్పించేలా ముసాయిదా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించారు. విత్తన రైతులకు నష్టాలు వస్తున్నాయనీ, కంపెనీలు మాత్రం లాభాలు పొందుతున్నాయని చెప్పారు. సోమవారం రైతు కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర విత్తన చట్టం-2025 ముసాయిదాలో అనేక లోపాలున్నాయని ఎత్తిచూపారు. 1994 నుంచి విదేశీ కంపెనీలు రాష్ట్రంలోకి ప్రవేశించాయనీ, కల్తీ, నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని 2004లో అప్పటి ప్రభుత్వం తేల్చిచెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
కల్తీ విత్తనాలను కొన్ని కంపెనీలు బ్రాండ్ వేసుకొని అమ్మటాన్ని తప్పుబట్టారు. 40 శాతం విత్తనాలు తెలంగాణలోనే సాగవుతున్నాయని చెప్పారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాలు సాగు చేసిన రైతులు కొందరు చనిపోయారనీ, చాలామంది మంచాన పడ్డారని తెలిపారు. పశువులు కూడా మృత్యువాతపడ్డాయన్నారు. రైతులకు కమిషన్ ఆధ్వర్యంలో ములుగు విత్తన రైతులకు మల్టీనేషనల్ కంపెనీల నుంచి రూ.4 కోట్ల పరిహారం ఇప్పించామని తెలిపారు. దేశ చరిత్రలో రైతులకు నష్టపరిహారం ఇప్పించడం ఇదే తొలిసారని చెప్పారు. నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు విత్తన ముసాయిదా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించారు. వ్యవసాయరంగం రాష్ట్ర పరిధిలో ఉన్న నేపథ్యంలో కొత్త చట్టంలో రాష్ట్రాలకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
విదేశాల నుంచి దిగుమతి అయిన గోధుమల్లో వయ్యారి భామ, మరికొన్ని విత్తనాల్లో సర్కారీ తుమ్మ వచ్చాయనీ, వాటిద్వారా రాష్ట్రమంతా ఆ మొక్కలు వ్యాపించాయని ఎత్తిచూపారు. అందుకే విత్తనాల సర్టిఫికేషన్‌లో కఠిన నిబంధనలను పెట్టాలని సూచించారు. రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి మాట్లాడుతూ…కేంద్రం తెచ్చిన విత్తన ముసాయిదా చట్టం రైతులకు నష్టం చేసేలా ఉందని విమర్శించారు. మూల విత్తనం వద్దే రైతు మోసపోతున్నాడని తెలిపారు. కల్తీవిత్తనాలను అరికట్టడానికి కంపెనీలను నియంత్రించాలన్నారు. ఉత్పత్తి, ధర, క్వాలిటీ కంట్రోల్ విషయంలో స్పష్టత ఉండాలని కేంద్రానికి సూచించారు. రైతు విత్తనం నాటిన తర్వాత మొలకెత్తని పక్షంలో విత్తన కంపెనీలపై చర్యలు ఉండేలా చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.



