నవతెలంగాణ- దామరచర్ల: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రణాళిక సిద్ధం చేయడం తోపాటు అమలు పరచాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి తెలిపారు. దామరచర్ల మండలం లోని కల్లేపల్లి జెడ్పి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల లను శనివారం తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. గణితము భౌతిక శాస్త్రము ఆంగ్లము సబ్జెక్టులకు సంబంధించి కఠిన అంశాలను ఎక్కువగా విశదీకరించి సులభతరంగా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు బోధించాలని, కఠినమైన అంశాల పట్ల విద్యార్థులు ఆసక్తి కలిగించే విధంగా అభ్యసన వాతావరణం నెలకొల్పాలని ఉపాధ్యాయులను సూచించారు.
డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసి ఉదయం సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించి పునరాభ్యాసనం చేయించాలని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు టీచింగ్ డైరీ బోధనోపకరణాలు వర్కు బుక్కుల అలైన్మెంట్ ఆధారంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచాలని ,తరగతి పూర్తి అయ్యే నాటికి పై తరగతికి కావలసిన సామర్థ్యాలు ప్రతి విద్యార్థి కలిగి ఉండే విధంగా బాధ్యత వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు గొబ్బూరి శ్రీనివాసరావు, శ్రీదేవి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ నాయక్, భారతి తదితరులు ఉన్నారు



